Begin typing your search above and press return to search.

కేటీఆర్ కంటే తానేం త‌క్కువ అంటున్న రేవంత్‌

By:  Tupaki Desk   |   25 April 2017 3:55 PM GMT
కేటీఆర్ కంటే తానేం త‌క్కువ అంటున్న రేవంత్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తనయుడు - రాష్ట్ర మంత్రి కేటీఆర్ కంటే తానేమీ త‌క్కువ కాద‌ని నిరూపించుకునేందుకు తెలంగాణ‌ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సిద్ధ‌మ‌వుతున్నారు. మంత్రి కేటీఆర్‌ తాండూర్ లో బహిరంగ సభ నిర్వహించిన ప్రాంగణంలోనే అంతకంటే ఎక్కువమంది ప్రజలతో బహిరంగ సభను నిర్వహిస్తామని తాను చేసిన సవాల్ ను నిరూపించుకోవడానికి రేవంత్‌ సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 న తాండూర్ లో జరగనున్న టీడీపీ ప్రజాపోరు రాజకీయ వర్గాలలో కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది.

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర రవాణశాఖ మంత్రి పట్నం మహేంధర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనహిత పేరుతో వివిధ జిల్లాలలో టీఆర్ ఎస్ బహిరంగ సభలను ఏర్పాటు చేయ‌గా అందులో మంత్రి కేటీఆర్ ముఖ్యవక్తగా ప్రసంగించారు. ఈ క్ర‌మంలో ఏప్రిల్‌ 3 న వికారాబాద్ జిల్లాకు సంబంధించి జనహిత సభను మంత్రి మహేంద‌ర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూర్ లో ఏర్పాటు చేశారు. ఈ సభలో కేటీఆర్ తనదైన శైలిలో ప్రసంగించడంతో పాటు విపక్షాలపై విమర్శన అస్త్రాల‌ను సంధించారు. అలాగే తన సభకు హాజరైన భారీ జనసందోహమే టీఆర్ ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్నఆధరణకు నిదర్శ‌నం అని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని టీడీపీ నేత రేవంత్ రెడ్డి స‌వాల్‌ గా తీసుకున్నారు. కేసీఆర్ వంద అబద్దాలకోరైతే కేటీఆర్‌ వెయ్యి అబద్దాల కోరు అని ఎద్దేవా చేయడంతోపాటు కేటీఆర్ కు ప్రజల్లో ఆదరణ ఉందని ఈ సభల ద్వారా చూపించి భావి ముఖ్యమంత్రిగా ఆయనను ప్రమోట్ చేయడం కోసమే ఈ సభను నిర్వహించారని రేవంత్ అదేరోజున కేటీఆర్ పై ధ్వజమెత్తారు. అంతేకాకుండా ప్రజల్లో ఎవరికి ఎంత ఆదరణ ఉందో తేల్చుకోవడానికి కేటీఆర్ సభ నిర్వహించిన చోటనే తాము బహిరంగ సభను నిర్వహిస్తామని తమ సత్తా ఏమిటో చూపిస్తామని రేవంత్ సవాల్ చేశారు. అందులో భాగంగానే ఈ నెల 28 న తాండూర్ లో ప్రజాపోరు బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం గతంలో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉండేది. అయితే జిల్లాల పునర్విభజన అనంతరం కొడంగల్ నియోజకవర్గానికి చెందిన 5 మండలాలలో 3 మండలాలు వికారబాద్ జిల్లా పరిధిలోకి చేరాయి. దీంతో రేవంత్ వికారబాద్ జిల్లా రాజకీయాలపై కూడ దృష్టిసారించారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చడం ద్వారా పాత రంగారెడ్డి జిల్లా పరిధిలోనే తాండూరు, చేవేళ్ల నియోజకవర్గాలకు తీవ్ర అన్యాయం చేశారని అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో కొడంగల్ నియోజకవర్గానికి రూ. 1100 కోట్లతో గత ప్రభుత్వం మంజూరు చేసిన ఎత్తిపోతల పథకాన్ని కూడ రద్దు చేసి కొడంగల్ నియోజకవర్గానికి కూడా తీరని అన్యాయం చేశారని రేవంత్ ఆరోపిస్తుండగా కేటీఆర్ దినికి భిన్నంగా ప్రస్తుతం తాము చేపట్టిన ప్రాజెక్టుల ద్వార మాత్రమే రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. దీంతో కేటిఆర్ సభ నిర్వహించిన చోటనే తాము కూడా బహిరంగ సభను నిర్వహించి వాస్తవాలను ప్రజలకు చెప్పాలని రేవంత్ నిర్ణయించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/