Begin typing your search above and press return to search.

ఎర్ర‌జెండాల బాట‌లో న‌డుస్తున్న రేవంత్

By:  Tupaki Desk   |   18 Jun 2017 7:31 AM GMT
ఎర్ర‌జెండాల బాట‌లో న‌డుస్తున్న రేవంత్
X
త‌న‌దైన శైలిలో దూకుడు రాజ‌కీయాలు చేసే తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌ రెడ్డి త‌న ఆందోళ‌న ప‌థం రూపు మార్చారు. భూ పోరాటాల విష‌యంలో స‌హ‌జంగా క‌మ్యూనిస్టు పార్టీలు చేసే ఆందోళ‌న రూప‌మైన‌... రైతుల‌ను వెంట‌బెట్టుకొని భూముల‌ను ఆక్ర‌మించ‌డం - భూమి దున్న‌డం - జెండాలు పాత‌డం వంటి కార్య‌క్ర‌మాల‌ను అచ్చు అలాగే చేసేయ‌డం ద్వారా రేవంత్ రెడ్డి ఎర్ర‌జెండాల కార్యాచ‌ర‌ణ‌ను ఫాలో అయ్యారు. తెలంగాణ‌లో క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న భూ కుంభ‌కోణంపై పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తున్న రేవంత్ తాజాగా ఇలా ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌కు దిగారు.

హైద‌రాబాద్ స‌మీపంలోని శంషాబాద్ మండలంలోని ఘన్సిమియాగూడలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూ ఆక్రమణ బాధిత రైతులను రేవంత్‌ రెడ్డి - పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ - నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి - అరవింద్‌ కుమార్ గౌడ్ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆక్రమణకు గురైన భూములను వారు పరిశీలించారు. అనంత‌రం భూములలో టీడీపీ జెండాలు పాతి భూమిలో రైతులతో కలిసి నాగలి పట్టిన రేవంత్ రెడ్డి భూమి దున్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆక్రమించిన ప్రభుత్వ భూములను రైతులకు అందజేయాలని, లేదంటే రైతుకు భూమి అందించే వరకు రైతులకు మ‌ద్దతుగా ఆందోళన ఉదృతం చేస్తామ‌ని రేవంత్ రెడ్డి ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆక్రమించిన ప్రభుత్వ భూములపై సీబీఐ విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గడీల పాలన, నిరంకుశ పాలన కొనసాగుతుందని, కేసీఆర్ కు రైతులే తగిన గుణపాఠం చెబుతారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

భూ రాబందు గోల్డ్ స్టోన్ ప్రసాద్‌ కు ముఖ్యమంత్రి కెసిఆర్ అమ్ముడు పోయారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సుప్రీంకోర్టులో మియాపూర్ భూ కుంభకోణం కేసులో నిందితులకు బెయిల్ మంజూరు సమయంలో ప్రభుత్వం తరఫున వాదించడానికి న్యాయవాదులను ప్రభుత్వం పంపించలేదని అన్నారు. అలాగే అడ్వకేట్ జనరల్ కూడా విచారణకు గైర్హాజరయ్యారని తెలిపారు. దీంతో నిందితులకు బెయిల్ చాలా సులభంగా దొరికిందని అన్నారు. దీనిని బట్టి గోల్డ్‌స్టోన్ ముందు ప్రభుత్వం సాగిలబడిందనడానికి ఇదే ఉదాహరణ అని ఆరోపించారు. నిందితులకు హైకోర్టు బెయిల్ తిరస్కరించిన తర్వాత మళ్లీ వారికి సుప్రీంకోర్టులో బెయిల్ రాకుండా ప్రభుత్వం ముందుగానే కెవియట్ వేయడం ఆనవాయితీ అని చెప్పారు. అయితే 15 వేల భూ కుంభకోణానికి పాల్పడిన నిందితులకు సుప్రీంలో బెయిల్ రాకుండా ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందని ఆరోపించారు. దీన్ని బట్టి గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కుటుంబానికి సీఎం కేసీఆర్ అమ్ముడు పోయారని రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీనికి తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/