Begin typing your search above and press return to search.

కెలికే టైం ఇది కాదు రేవంత్

By:  Tupaki Desk   |   15 July 2015 3:54 AM GMT
కెలికే టైం ఇది కాదు రేవంత్
X
విమర్శలు చేయటం తప్పేం కాదు. రాజకీయ నాయకులు అన్న తర్వాత.. విమర్శలు.. ఆరోపణలు చేయటమే వారి ఉద్యోగం. తిరిగే కాలు.. తిట్టే నోటిని ఆగిపొమ్మంటే ఎవరికి మాత్రం సాధ్యం అవుతుంది. అయితే.. అందుకు సమయం.. సందర్భం చాలా అవసరం. రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం అంత మంచిది కాదు.

తాజాగా టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మాటలు చూస్తే ఇలాంటి భావన కలగటం ఖాయం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కర స్నానం చేయటంపై రేవంత్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వదిన (కేసీఆర్ అన్న భార్య) చనిపోవటంతో కేసీఆర్ కు మైల ఉంటుందని.. ఆయన పుష్కర స్నానం ఆచరించొచ్చద్దని వేద పండితులు చెప్పినా.. కేసీఆర్ వినలేదన్నది రేవంత్ వాదన.

పండితుల మాటను పెడ చెవిన పెట్టి గోదావరిలో మునిగారని మండిపడిన రేవంత్.. లక్ష పాపాలు చేసి గోదాట్లో మునిగితే పాప పరిహారం జరుగుతుందన్న ఉద్దేశ్యంతో మునిగినట్లు ఉందంటూ ఎటకారం చేసుకున్నారు. ఓ పక్క రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాట జరిగి పెద్ద ఎత్తున చనిపోయి.. పరిస్థితి ఇబ్బందికరంగా మారిన వేళ.. ఇలాంటి మైల మాటలు మాట్లాడి.. భక్తుల మనోభావాలు కలిగించటం..మరిన్ని సందేహాలు కలిగేలా మాట్లాడటం అంత మంచి కాదన్న భావన వ్యక్తమవుతోంది.

ముఖ్యమంత్రి తప్పు చేశారా? లేదా? అన్న విషయం తేలాల్సి ఉంది. కానీ.. తప్పు చేసినట్లుగా తేల్చేసి.. సెంటిమెంట్లు ఉన్న వారిని మనసుల్లో కొత్త సందేహాల్ని తీసుకురావటం అంత మంచిది కాదు. రాజకీయ ప్రయోజనం కన్నా ప్రజా ప్రయోజనం మిన్న అన్న విషయాన్ని రేవంత్ గుర్తించి.. ఇలాంటి విషయాల్నిప్రస్తావించకుండా ఉంటే బాగుంటుందేమో.