Begin typing your search above and press return to search.

ఈ ఆంధ్రా గోలేంది రేవంత్‌రెడ్డి

By:  Tupaki Desk   |   11 July 2015 10:46 AM GMT
ఈ ఆంధ్రా గోలేంది రేవంత్‌రెడ్డి
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోటి నుంచి ఆంధ్రోళ్లు అన్న మాట వస్తే ఎక్కడో కాలుతుంది. ఈ మధ్యన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సైతం.. ఆంధ్రా అన్న మాట ఎందుకు వాడతారని ప్రశ్నించారు. పవన్‌ చెప్పిన విశ్లేషణ చూసిన తర్వాత.. ఎవరినైనా తిట్టాలన్నా.. విమర్శ చేయాలన్నా ఆంధ్రా అన్న మాటను ఉపయోగించాల్సిన అవసరమే లేదని అర్థమవుతుంది. నిజానికి ఈ విషయం తెలీటానికి పవన్‌ కల్యాణ్‌ మాత్రమే చెప్పనక్కర్లేదు. తలకాయలో కాస్తంత గుజ్జు ఉన్న వారు ఎవరైనా సరే అదే మాట చెబుతారు.

నిజానికి ఒక వెధవ పని చేస్తే.. దాన్ని ఎత్తి చూపాలే కానీ.. ఆ వ్యక్తి కులం.. ప్రాంతం.. లాంటి అంశాలు అవసరం లేదు. ఫలానా ప్రాంతం వాడు దొంగ అనటం ద్వారా.. ఫలానా ప్రాంతానికి చెందిన వారంతా దొంగలే అన్న భావన కలగటం ఖాయం. అందుకే.. అవసరం లేని విశేషణాల్ని మాటల్లో తీసుకురావాల్సిన అవసరం లేదు. కాకపోతే.. రాజకీయ లాభం కోసం ఇలాంటివి నేతలు తరచూ చేస్తుంటారు.

ఇలా ప్రాంతీయ భావోద్వేగాల్ని స్పృశించేలా మాట్లాడే నేతల్లో తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా టీటీడీపీ ఎమ్మెల్యే.. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్‌ అయి జైలుకు వెళ్లి.. బెయిల్‌ మీద ఈ మధ్యనే బయటకు వచ్చిన రేవంత్‌రెడ్డి వ్యవహారాన్నే చూద్దాం. తాజాగా ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టారు.

ఈ సందర్భంగా ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. అందులో కీలకమైంది.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌కు ఆత్మగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు డైరెక్షన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి నడుస్తున్నారని ఆరోపించారు. అయినా.. ఆంధ్రాకు చెందిన కేవీపీతో కేసీఆర్‌కు దోస్తీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేవీపీ తరచుగా గచ్చిబౌలిలో కలుస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. కేసీఆర్‌కుటుంబ సభ్యులు కేవీపీని ఢిల్లీలో కలుస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తాను చేసిన ఆరోపణల్ని కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఎవరు ఖండించినా తాను ఆధారాలతో బయటపెడతానని సవాల్‌ విసిరారు.

ఈ ఆరోపణల్ని ఎవరూ ఏమీ కాదనరు. కానీ.. అభ్యంతరకరమైన విషయంఏమిటంటే.. కేవీపీ పేరు వాడటానికి ముందు ఆయన ప్రాంతాన్ని ప్రస్తావించాల్సిన అవసరం రేవంత్‌కు ఎందుకు అన్నది పెద్ద ప్రశ్న. కేవీపీని కలవటం తప్పా? ఆంధ్రాకు చెందిన కేవీపీని కలవటం తప్పా? అన్న విషయంపై రేవంత్‌ స్పష్టత ఇస్తే బాగుంటుంది.

అయినా.. ఆంధ్రాకు చెందిన కేవీపీతో దోస్తీ ఏమిటంటూ ప్రశ్నిస్తున్న రేవంత్‌.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతలతో దోస్తీ పనికిరాదని చెబుతున్నారా? ఒకవేళ అదే నిజమైతే.. ఆయన పార్టీ అధినేత అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి అన్న విషయాన్ని మర్చిపోయారా? చేసిన తప్పును.. తప్పుడు పనుల్ని ఎత్తి చూపించటంలో తప్పు లేదు కానీ.. అందుకు వారి ప్రాంతాన్ని ప్రస్తావించటం ఎంతమాత్రం సమంజసం కాదన్న విషయాన్ని రేవంత్‌ మర్చిపోకూడదు.