Begin typing your search above and press return to search.

పాలిటిక్స్‌ పై రేవంత్ మాట విన్నారా?

By:  Tupaki Desk   |   15 Sep 2017 12:54 PM GMT
పాలిటిక్స్‌ పై రేవంత్ మాట విన్నారా?
X
రాజ‌కీయాల్లో విలువ‌లు నేర్పుతాం. విలువ‌ల‌కు పుట్టినిల్లు మాదే. అని ప‌దే ప‌దే చెప్పుకొనే టీడీపీ నేత‌లు.. ఇప్పుడు త‌మ ప‌బ్బం గ‌డ‌వ‌క‌పోయే స‌రికి ఆ విలువ‌ల‌ను ఎంత‌లా తుంగ‌లో తొక్కుతారో చెప్పేందుకు ఇది ఓ ఉదాహ‌ర‌ణ‌. తెలంగాణ‌లో దాదాపు అడ్ర‌స్ గ‌ల్లంత‌యిన పార్టీ టీడీపీ. ఆ పార్టీ అధినేత ఏపీలో ఎక్కడ అధికారం పోతుందోన‌నే దిగులుతో ఒక్క అడుగు కూడా హైద‌రాబాద్‌ లో పెట్ట‌డం లేదు. ఒక వేళ వెళ్లినా.. మ‌న‌వ‌డిని చూసి రాత్రికిరాత్రి అమ‌రావ‌తిలో వాలిపోతున్నారు. దీంతో తెలంగాణ‌లో టీడీపీ అంటే.. `ఇంకా ఉందా?` అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో పార్టీని కాపాడుకోవ‌డం కోసం, ఉనికిని కాపాడుకోవ‌డం కోసం.. అక్క‌డి నేత‌లు బాబు వ‌ల్లె వేస్తున్న విలువ‌ల‌కు తిలోదాకిస్తున్నారు.

అంతేకాదు, ఎవ‌రైనా ఆ విలువ‌ల‌ను ప్ర‌శ్నిస్తే.. ఎదురు దాడి కూడా చేస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. దేశంలోనే ప్ర‌ఖ్యాతిగాంచిన సింగ‌రేణి కాల‌రీస్‌ లో గుర్తింపు సంఘం ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి యూనియ‌న్ ఏర్పాటు చేసుకునేందుకు అధికార టీఆర్ ఎస్ స‌హా విప‌క్షాలు త‌మ త‌మ‌ ప్ర‌య‌త్నాల్లో మునిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో విలువ‌ల‌కే విలువ‌లు నేర్పుతామ‌ని చెప్పుకొనే టీడీపీ.. నేత‌లు కాంగ్రెస్‌ - సీపీఐతో చేతులు క‌లిపారు. వాస్త‌వానికి ఈ రెండు పార్టీల‌నూ గ‌తంలో టీడీపీ నేత‌లు తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు. కాంగ్రెస్ చ‌చ్చిపోయింద‌ని - సీపీఐని ప్ర‌జ‌లే బ‌హిష్క‌రించార‌ని అప్ప‌ట్లో నోటికి వ‌చ్చిన‌ట్టు తిట్టి పోశారు.

అయితే, ఇప్పుడు అవ‌స‌రం కోసం ఆ పార్టీల‌తోనే జ‌ట్టుక‌ట్టి.. జై కొడుతున్నారు. ఇదే విష‌యాన్ని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. మీరు, మీ నాయ‌కుడు చంద్ర‌బాబు.. ప‌దేప‌దే విలువ‌ల గురించి క్లాస్ ఇస్తారు క‌దా? ఇప్పుడు ఆ విలువ‌లు ఏమ‌య్యాయ‌ని నిల‌దీశారు. దీనికి ప్ర‌తిగా స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి.. ఎంత మాత్రం జంకు గొంకు లేకుండా.. సీఎం కేసీఆర్‌ పై ఎదురు దాడికి దిగారు. కేసీఆర్ ఏం చేసినా సంసారం అవుతుంది.. ఇతరులు ఏది చేసినా వ్యభిచారంలా కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. అంటే.. తాము చేసేది వ్య‌భిచారం అని ఒప్పుకున్న‌ట్టేగా?! కానీ, రేవంత్ ఈ విష‌యాన్ని లైట్‌ గా తీసుకున్నారు.

అంత‌టితో ఆగ‌ని రేవంత్‌.. 2014లో ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చ‌లేద‌ని, తప్పుడు ప్రచారంతో టీఆర్ ఎస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోంద‌ని, అందుకే తాము విలువ‌ల‌ను ప‌క్క‌న పెట్టామ‌ని చెప్పుకొచ్చారు. ఎజెండాలు - అజెండాలు గాలికొదిలి.. ఆ పార్టీల‌తో జ‌ట్టుక‌ట్టామ‌ని చెప్పారు. దీంతో టీడీపీ అస‌లు బాగోతం బ‌య‌ట‌ప‌డింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. గ‌తంలోనూ చంద్ర‌బాబు.. కేసీఆర్ వైఖ‌రిపై మండిప‌డ్డారు. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల్లా కొంటున్నార‌ని, నీతి మాలిన రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అన్నారు. మ‌రి ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చుకున్న‌ప్పుడు మాత్రం ఈ మాట‌లు మ‌రిచిపోయారు!! ఎంతైనా.. బాబు మార్కు రాజ‌కీయం అంటే ఇలానే ఉంటుందేమో?!!