Begin typing your search above and press return to search.

పాత‌బ‌స్తీ ఓవైసీకి..కొత్త బ‌స్తీ కేసీఆర్ కు!

By:  Tupaki Desk   |   10 Dec 2016 1:33 PM GMT
పాత‌బ‌స్తీ ఓవైసీకి..కొత్త బ‌స్తీ కేసీఆర్ కు!
X
హైదరాబాద్ పాత నగరాన్ని ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్‌ ఓవైసీ, కొత్తనగరాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంచుకొని పాలిస్తూ... ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పటివరకు తన హామీని నిలబెట్టుకోకపోయినా ఓవైసీ కేసీఆర్‌ను ఎందుకు నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎంఐఎంకు చెందిన నేత జీవీజీ నాయుడు తన అనుచరులతో కలిసి టీడీపీలోకి చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన రేవంత్ ప్రసంగించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నాలుగు నెలల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని అయితే అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటిపోతున్నా తన హామీని ఆయన నిలబెట్టుకోలేదని రేవంత్‌ గుర్తు చేశారు. ముస్లింల తరపున మాట్లాడడం తన గుత్తాధిపత్యం అనుకునే ఓవైసీ ఈ విషయం గురించి కేసీఆర్‌ను ఎందుకు నిలదీయరని సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు అన్ని వాస్తవాలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయని ప్రజల పక్షాన పోరాడే తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో మద్దతు పెరుగుతోందని రేవంత్ అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో హైటెక్ సిటీ నుంచి ఏయిర్ పోర్టు దాకా కనిపించే అభివృద్ధి అంతా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పారు. హజ్ హౌస్ ను కూడా టీడీపీ హయాంలోనే నిర్మించారని గుర్తు చేశారు. తమ పార్టీ ఎప్పుడు కూడా ముస్లింలకు అండగానే ఉంటుందన్నారు. రాజుల కాలంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను నిర్మిస్తే తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్తగా సైబరాబాద్ నగరాన్ని నిర్మించి హైదరాబాద్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని రేవంత్ ప్రశంసించారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి నేతలను హైదరాబాద్ కు తీసుకొచ్చి ఐటీ ఇండస్ట్రీని అభివృద్ధి చేసిన ఘనత కూడా చంద్రబాబుదేనని కితాబిచ్చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో హిందూ-ముస్లింల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టి పబ్బంగడుపుకునేవారని అయితే టీడీపీ హయాంలో అలాంటి చర్యలకు తెరపడిందని రేవంత్ తెలిపారు. తమ పార్టీ హయాంలో 11 నెలల కాలంలో హైటెక్ సిటీని నిర్మిస్తే ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడేళ్లు అవుతున్నా హైటెక్ సిటీ ముందు కనీసం మురికి కాల్వలు కూడా నిర్మించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. గచ్చిబౌలిలో క్రీడాభివృద్ధి కోసం పెద్ద స్టేడియంను తమ పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మిస్తే కాంగ్రెస్ హయాంలో దానిని పార్టీ ప్లీనరీ సమావేశాలకు, టీఆర్ఎస్ హయాంలో పెళ్లిళ్లు చేయడానికి ఉపయోగిస్తున్నారని రేవంత్ ఎద్దేవాచేశారు. హైదరాబాద్ నగరంలో చెత్తతీయడం కూడా చేతకాని టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తామని ప్రగల్భాలు ప‌లుకుతోంద‌ని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం ఇష్టమైతే ఆయన కొడుకు కేటీఆర్‌కు సెల్పీలు తీసుకోవడం ఇష్ట‌మ‌ని రేవంత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హుస్సేన్ సాగర్లోని నీళ్లను ప్రక్షాళన చేసి కొబ్బరినీళ్లుగా చేస్తానని హామీలు పలికిన కేసీఆర్ ఇప్పటి వరకు చేసిందేమిటో తెలియాలంటే ఆయన తాగేమందులో కలుపుకోవడానికి హుస్సేన్ సాగర్ నీళ్లను ఇవ్వాలని రేవంత్ పేర్కొన్నారు.

టీటీడీపీ అధ్యక్షులు ఎల్. రమణ మాట్లాడుతూ తమ పార్టీలో యువకులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికలలో తమ పార్టీ తరపున 50 శాతం సీట్లను యువకులకే కేటాయించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందాలన్నా నగరంలో శాంతి భద్రతలు నెలకొనాలన్నా టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత అని రమణ అభిప్రాయపడ్డారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ తప్పిదాల కారణంగా ఈ మధ్యకాలంలోనే 41 మంది మరణించారని చెప్పారు. వీరిలో 25 మంది ఇళ్లు-భవనాలు కూలి మరణించగా, మిగిలినవారు మురికి కాలువలో కొట్టుకపోయి మరణించారని తెలిపారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో అటు ప్రజలతోపాటు ఇటు ఆపార్టీ నాయకులు సైతం విసిగిపోతున్నారని అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని జి.వి.జి. నాయుడును అభినందించారు.