Begin typing your search above and press return to search.

ఓ రేవంత్.. ఓ బడాయి

By:  Tupaki Desk   |   18 Feb 2016 1:14 PM GMT
ఓ రేవంత్.. ఓ బడాయి
X
దెబ్బ మీద దెబ్బ కొడుతూ.. కోలుకునేందుకు సైతం అవకాశం ఇవ్వని ప్రత్యర్థి నుంచి తమను తాము కాపాడుకోవటానికి ఏం చేయాలి? చేతల్లో ఏమీ చేయలేనప్పుడు కనీసం బడాయి మాటలతోనైనా తానెంత గొప్పవాడినన్న విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేయాలి. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్.. ఏ రకంగా చూసినా తెలంగాణ అధికారపక్షం తమపై సంపూర్ణ అధిపత్యానికి పావులు కదుపుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. బిక్కచచ్చిపోయిన క్యాడర్ కు భరోసా ఇచ్చేలా మాట్లాడే బాధ్యత తీసుకున్న రేవంత్ బడాయి మాటల్ని ఆశ్రయించటం గమనార్హం.

గురువారం కూకట్ పల్లి నియోజకవర్గ సమీక్షా సమావేశానికి హాజరైన రేవంత్ మాట్లాడుతూ.. తాజాగా ముగిసిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయం సాంకేతికంగా తేల్చేశారు. 99 డివిజన్లు సొంతం చేసుకున్న అధికార టీఆర్ ఎస్ విజయం సాంకేతికమని.. ఒక్క డివిజన్ గెలిచినప్పటికి గ్రేటర్ లో తమదే నైతిక విజయమని చెప్పుకొచ్చారు. ఇక.. తన గురించి గొప్పలు చెప్పుకునే క్రమంలో.. ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలుస్తానని గొప్పలు చెప్పుకున్నారు.

2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో 100 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేయటం గమనార్హం. విజయం మీద ఆశ ఉండటం మంచిదే. కానీ.. అది పేరాశగా ఉండకూదన్న విషయాన్ని మర్చిపోకూడదు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ మీద విజయం.. తెలంగాణలో 100 అసెంబ్లీ స్థానాల్లో విజయం సంగతి తర్వాత.. కనీసం వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల్ని పెట్టగలిగే సత్తా ఉందా?అన్న ప్రశ్నకు రేవంత్ సూటిగా బదులిస్తే బాగుంటుంది.