Begin typing your search above and press return to search.

పార్టీ చేసిన త‌ప్పును తాను చేయ‌న‌న్న రేవంత్

By:  Tupaki Desk   |   24 Oct 2016 1:13 PM GMT
పార్టీ చేసిన త‌ప్పును తాను చేయ‌న‌న్న రేవంత్
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హ‌వా అప్ర‌తిహ‌తంగా సాగిపోతున్న‌ప్ప‌టికీ - టీడీపీ ప్రాభ‌వం దారుణంగా కోల్పోతున్న‌ప్ప‌టికీ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం స‌ర్కారుపై త‌న పోరు బాట‌ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాలంద‌రినీ క‌లుపుకొని పోదామ‌ని భావించిన రేవంత్ ఎత్తుగ‌డ ఫ‌లించ‌ని నేప‌థ్యంలో...సొంత క్యాడ‌ర్‌ లో స్థైర్యం నింపేందుకు రేవంత్ తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో గ‌తంలో పార్టీ అవ‌లంభించిన‌ ప‌లు త‌ప్పుడు విధానాల‌ను తాను ప‌క్క‌న‌పెడుతాన‌ని స్ప‌ష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగిస్తూ 2019 ఎన్నిక‌ల నాటికి తెలుగుదేశం నాయ‌కుల‌ హ‌స్త‌వాసి మారిపోతుంద‌ని భ‌రోసా ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఇంకా సరైన గుర్తింపునకు నోచుకోని నేతలు - కార్యకర్తలు ఉన్నారని ఆలాంటి వారికి ఇప్పుడు మరింత ప్రాధాన్యతను ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికలలో సీనియర్లకు తగిన ప్రాధాన్యతను ఇస్తామని పార్టీ ప్రకటించిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. టీడీపీలో టీఎన్టీయూసీ నేతలకు ఇప్పటి వరకు పార్టీలో సరైన ప్రాధాన్యత లభించలేదని, వారిని ద్వితియ శ్రేణి పౌరులుగా పార్టీలో పరిగణించారన్న ఆవేదన కొంత మందిలో ఉందనే విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని చెప్పారు. అయితే అలాంటి పరిస్థితులు ఇకపై కొనసాగవని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలలో టీఎన్టీయూసీ నాయకత్వాన్ని కూడా మరింత ముందుకు తీసుకు వెళ్ళాలని పార్టీ అధిష్ణానం నిర్ణయించిందని దీని ప్రకారంగానే పలువురు టీఎన్టీయూసీ క్రీయాశీలక నాయకులకు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లను కేటాయించే అవకాశం ఉందని రేవంత్‌ వెల్లడించారు. సమాజంలో ప్రజలకు ప్రభుత్వాల పనితీరును తెలియజేయడంలో కార్మికుల‌ది కీలక పాత్ర అని, ప్రజలతో ప్రత్యక్షంగా కార్మికులు నేరుగా ప్రజలతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తమ అభిప్రాయాలను చెబుతుంటారని వారు చెప్పే అభిప్రాయాల మేరకే ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వస్తారని విశ్లేషించారు.

ఈ సందర్భంగా ఆయన ఆటో - టాక్సి డ్రైవర్లను రేవంత్‌ ఉదాహరించారు. కార్మికులు సంతృప్తి చెంది ప్రభుత్వ పనితీరు బాగుందని కితాబు ఇచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లో కూడా ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న విషయంగా తనకు అవగాహన ఉందని చెప్పారు. పార్టీ అధికారంలోకి వస్తే కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి పథకాలను చేపడతారనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రంలో కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. గతంలో కేసీఆర్ హామీ ఇచ్చి విస్మరించిన కాంట్రాక్టు - ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర అంశాలపై సమగ్ర స్థాయిలో టీఎన్టీయూసీ కార్యాచరణను రూపొందించి పోరాటాలను కొనసాగించాలన్నారు. వచ్చే నెల 9వ తేదీన జరిగే టీఎన్టీయూసీ ప్రమాణ స్వీకర కార్యక్రమానికి టీడీపీ జాతీయ నాయకులను తీసుకు వస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బి.ఎన్.రెడ్డి మాట్లాడుతూ.. గతంలో నాయిని నర్సింహారెడ్డి లాంటి నాయకులను కూడా ఓడించి ఇంటికి పంపిన చరిత్ర టీఎన్టీయూసికి ఉందన్నారు. పలు కారణాలతో తాము 14 సంవత్సరాల పాటు నిర్లిప్తంగా ఉండిపోవాల్సి వచ్చిందని, అయితే ఇప్పుడు రేవంత్ ప్రోత్సాహంతో మరోసారి రాష్ట్రంలో కదనరంగంలోకి దూకడానికి సిద్ధమయ్యాయమని చెప్పారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/