Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఖాయమా?

By:  Tupaki Desk   |   9 Jun 2020 9:50 AM GMT
రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఖాయమా?
X
తెలంగాణ కాంగ్రెస్ లో అనూహ్యమైన మార్పులు జరగబోతున్నాయా? ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త పీసీసీ చీఫ్ రాబోతున్నారా? దూకుడుగా టీఆర్ఎస్ ను ఎదుర్కొంటున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఈ కీలక పదవి దక్కబోతోందా? అంటే ఔననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఈ మేరకు ప్రచారం జోరందుకుంది.

రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. చాలాకాలంగా టీపీసీసీ పదవి అంశాన్ని పెండింగ్‌లో పెట్టిన కాంగ్రెస్ అధినాయకత్వం... ప్రస్తుతం కేటీఆర్, కేసీఆర్ లపై దూకుడుగా ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

తెలంగాణలో టీపీసీసీ పదవిని కొత్త వారికి ఇచ్చే విషయంలో మరింత ఆలస్యం చేయొద్దనే భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఇందుకు సంబంధించి ఢిల్లీలో చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ రేసులో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ముందున్నారనే ప్రచారం సాగుతోంది.

అయితే రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి రేసులో ఉండటాన్ని కాంగ్రెస్‌లోని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో, రాజకీయాల్లో తమకంటే జూనియర్ అయిన రేవంత్ రెడ్డికి ఈ పదవి ఇవ్వడం సరికాదనే భావనలో వారంతా ఏకమైనట్లు సమాచారం. కొందరు నేతలు ఈ విషయాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. జగ్గారెడ్డి ఏకంగా రేవంత్ కు పీసీసీ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి, వీహెచ్ లు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నట్టు సమాచారం.

కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఓ ముఖ్యనేత రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పగ్గాలు ఇస్తే బాగుంటుందని హైకమాండ్‌కు చెప్పారని... ఆయన సూచన మేరకు రేవంత్ రెడ్డికి ఈ పదవి కట్టబెట్టేందుకు లైన్ క్లియర్ అయ్యిందని పలువురు చర్చించుకుంటున్నారు. మరి సీనియర్లు అంతా వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ దక్కుతుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది.