Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్ట్రాట్ చేసిన రేవంత్ రెడ్డి

By:  Tupaki Desk   |   16 July 2021 2:59 PM GMT
కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్ట్రాట్ చేసిన రేవంత్ రెడ్డి
X
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టగానే తన టార్గెట్ ను ఫిక్స్ చేసేశాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని డిసైడ్ అయ్యాడు. అందుకే కేసీఆర్ టార్గెట్ గానే రాజకీయాలు మొదలుపెట్టాడు.తాజాగా నిరుద్యోగం, పెరుగుతున్న ధరలను రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక టేకప్ చేశాడు. తాజాగా పెట్రో, డీజిల్ ధరలపై పోరుబాట పట్టాడు.

పెరుగుతున్న ఇంధన ధరలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ తొలి నిరసన చేపట్టారు. రేవంత్ నేతృత్వంలో ‘చలో రాజ్ భవన్’ కు పిలుపునిచ్చాడు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్న కేంద్రరాష్ట్రప్రభుత్వాలపై దండెత్తాడు. అయితే ముందుగానే కేసీఆర్ సర్కార్ కాంగ్రెస్ కార్యకర్తలు నేతలను లక్ష్యంగా చేసుకుంది. వారందరినీ ముందే అదుపులోకి తీసుకొని నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా భగ్నం చేసింది.

ఈ క్రమంలోనే రేవంత్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశాడు. సీఎం కేసీఆర్ తాను ఊహించిన దానికంటే ఎక్కువ కాలం ప్రగతి భవన్ లో ఉండడని స్పష్టం చేశారు. కేసీఆర్ కు కేవలం 730 రోజులు మాత్రమే సమయం ఉందని.. ఆ తర్వాత ఒక గంట కూడా ఆయన ప్రగతి భవన్ లో ఉండడు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రగతి భవన్ ప్రతి ఇటుకను కూల్చివేసి దాని నుంచి కేసీఆర్ ను విసిరేస్తారని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే కేసీఆర్ కొంత మంది బంధువులు ఇతర దేశాల పాస్ పోర్టులు తీసుకుంటున్నారని.. వారంతా దేశం విడిచి పోతారని తనకు సమాచారం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఆయన ఉస్తాదులు రెండేళ్ల తర్వాత పారిపోవడం ఖాయం అని అన్నారు. కేసీఆర్ ఎక్కడ దాక్కున్నా.. మేము ఆయన్ని విడిచిపెట్టం ’ అని హెచ్చరించాడు.ఇక పోలీస్ శాఖను కూడా రేవంత్ రెడ్డి విమర్శించాడు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొద్దిమంది పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారని.. వారిలో ఐజీ ప్రభాకర్ రావు ఒకరని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల ఫోన్లను పోలీసులు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. మా ప్రణాళికలను ముందుగానే తెలుసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాకింగ్ చేయిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులు మూల్యం చెల్లిస్తారన్నారు.ఈ విషయంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి దారుణంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిబంధనలకు విరుద్దధంగా పోస్టింగ్ దక్కించుకున్న ఆయన ఈ పనిచేశారన్నారు. ఆయనపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు.

డీజిల్ , పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ సూచనతోనే కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకుంటోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సోనియా పాలన తెలంగాణలో రాబోతోందని.. ప్రజలు పెట్రో ధరల నుంచి విముక్తి పొందుతారని అన్నారు. రైతులకు అన్ని రకాల మద్దతు లభిస్తుందని అన్నారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన తొలి నిరసన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కేసీఆర్ సర్కార్ అడుగడుగునా అడ్డుకున్నా నేతలు, కార్యకర్తలను సమీకరించి ఆందోళన బాట పట్టించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇదే ఊపు కేసీఆర్ సర్కార్ పై కొనసాగితే రేవంత్ రెడ్డి ముందు ముందు కొరకరాని కొయ్యగా తయారయ్యే ప్రమాదం ఉంటుందంటున్నారు.