Begin typing your search above and press return to search.

రాష్ట్రానికి అప్పులు..కేసీఆర్‌ కు ఆస్తులు

By:  Tupaki Desk   |   17 Feb 2017 1:22 PM GMT
రాష్ట్రానికి అప్పులు..కేసీఆర్‌ కు ఆస్తులు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌రోమారు మండిప‌డ్డారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న దోపిడీ విధానాల కారణంగా రాఫ్రానికి అప్పులు పెరుగుతుండగా కేసీఆర్ కుటుంబానికి మాత్రం ఆసులు పెరుగుతున్నాయని ఆయ‌న విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 ఏళ్ల కాలంలో 17 మంది ముఖ్యమంత్రులు రూ.60 వేల కోట్ల అప్పులను చేస్తే గడిచిన రెండున్నరేళ్ల కాలంలో కేసీఆర్ రాష్ట్ర రుణాన్ని రూ. లక్షా 20 వేల కోట్లకు పెంచారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులు పెరగడం పట్ల రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

అప్పులు చేయడం కోసమే ప్రత్యేకంగా కొన్ని కార్పొరేషన్లను సృష్టించి 60 ఏళ్ల కాలంలో లేనంత భారీ అప్పలను రెండేళ్ల కాలంలోనే తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ అప్పులకు తోడుగా గడిచిన మూడేళ్ల బడ్జెట్లలో మరో రూ. 3 లక్షల 50 వేల కోట్ల లను కూడా కేసీఆర్ ఖర్చు చేశారని మండిప‌డ్డారు. ఈ విధంగా రాష్ట్రంలో గడిచిన రెండున్నరేళ్ల కాలంలోనే రూ. 4 లక్షల 70 వేల కోట్ల ఖర్చు చేసినా ఏ ఒక్క పేద వాడికి డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేదని, రైతులకు పూర్తిగా రుణమాఫీ కూడా కాలేదని, ఏ ఒక్క దళిత, గిరిజన కుటుంబానికి కూడా మూడెకరాల భూమిని ప్రభుత్వం కొని ఇవ్వలేదని విమర్శించారు. ఎన్నికలలో తాను ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చనప్ప‌టికీ మొత్తం నిధులను ఏం చేశారనే విషయంగా శ్వేత పత్రాన్ని ప్రకటించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు, మిషన్ భగీరథ పేరిట ఇష్టానుసారంగా అప్పలు చేయడం వాటిని ప్రజల నెత్తిన రుద్దడం సమంజసం కాదని రేవంత్ హితవు చెప్పారు. ఒకవైపు రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే మరోవైపు కేసీఆర్ కుటుంబం ఆస్తులు కూడా పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నిజమైన ఉద్యమకారులందరూ పలు రకాలుగా నష్టపోయారని అయితే కేసీఆర్ కుటుంబం మాత్రం వందలాది ఎకరాలలో ఫాంహౌస్ - తెలుగు - ఉర్దూ - ఇంగ్లిష్ భాషల్లో పత్రికలు సొంత టీవీ ఛానల్లను సంపాధించుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబానికి ఈ ఆస్తులు ఎలా సమకూరాయో ప్రజలకు చెప్పాల్సిన అవసరముందని ఆయన నిలదీశారు.

ప్రజలు తనకు ఇచ్చిన 5 సంవత్సరాల అధికార పదవీకాలంలో ఫాంహౌస్ లో కూర్చొని కోట్ల రూపాయలు కమీషన్లుగా దండుకున్న కేసీఆర్ మిగిలిన రెండున్నర సంవత్సరాలకాలాన్ని ప్రజల మధ్య కులాల కుంపట్ల రగిల్చి ఓట్లు దండుకోవడానికి వ్యూహరచనలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. టీడీపీ హయాంలో ప్రజల వద్దకు పాలన చేపట్టి నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించడం జరిగేదని ఆయన గురు చేశారు. అయితే ప్రజాస్వామ్య విధానంపై గౌరవం లేకనే కేసీఆర్ ప్రజలు తన వద్దకే వచ్చి సమస్యలు చెప్పాలని కోరుతున్నానని విమర్శించారు. ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలను తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించే ధైర్యం టీఆర్ఎస్ నేతలకు లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను వ్యతిరేక ముఠాలుగా అభివర్ణిస్తున్న టీఆర్ఎస్ నేతలే దోపిడీ దొంగల ముఠా నేతలని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం ఏ ఎన్నికలు లేకున్నా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్న లక్ష్యంతోనే ప్రజాపోరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కొల్లాపూర్, గజ్వేల్లలో విజయవంతంగా నిర్వహించిన ప్రజాపోరు కార్యక్రమాన్ని ఈనెల 20న నిర్మ‌ల్ లో నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/