Begin typing your search above and press return to search.

రేవంత్ నంబర్ 2 మాట..కాంగ్రెస్ లో పోటీ తీవ్రం.

By:  Tupaki Desk   |   2 Oct 2018 6:39 AM GMT
రేవంత్ నంబర్ 2 మాట..కాంగ్రెస్ లో పోటీ తీవ్రం.
X
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారే కాలేదు. అందునా గెలిచేవారెవరు.? ఓడేవారెవరు.? పోనీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా.? రాదా.? వస్తే సీఎం ఎవరు.? అంతమంది రెడ్డిల్లో ఆ పెద్ద సీటుకు అర్హులెవరు.? సీఎం సీటును పక్కనపెడదాం.. రెండో పోస్టు ఎవరికి.? ఆలూ లేదు.. చూలు లేదు.. అప్పుడే డిప్యూటీ సీఎం అట.. ఇప్పుడు ఈ మాట తెలంగాణ కాంగ్రెస్ ను షేక్ చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కామారెడ్డిలో కాంగ్రెస్ సభలో పాల్గొన్నరేవంత్ రెడ్డి..తనకు ఇన్ఫర్మేషన్ ఉందో లేక యథాలాపంగా నియోజకవర్గ అభ్యర్థిని పొగడాలని అన్నాడో కానీ.. ఇప్పుడదే కాంగ్రెస్ లో ఆశావహులకు గట్టి షాక్ ఇస్తోంది..

మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ అది.. ఎన్ని పిల్ల కాలువలు వచ్చినా అందులో కలిసిపోవాల్సిందే కానీ.. సొంతంగా ఎదగడానికి ఆస్కారం లేదన్నది టీఆర్ ఎస్ పార్టీ విమర్శ. అందులోకి టీడీపీ ని వీడి వచ్చిన రేవంత్ కూడా ఇప్పుడు సీనియర్ల ఎత్తులకు చిత్తైపోతున్నారు. తాను సీఎం అవుదామని వస్తే.. తనకంటే 10మంది పోటీ ఉండడంతో కక్కలేక మింగలేపోతున్నారు. ఇప్పుడు సీఎం పోస్టును వదిలి డిప్యూటీ సీఎం పోస్టుపై చర్చ పెట్టాడు. కామారెడ్డి సభలో షబ్బీర్ అలీ గెలిస్తే తెలంగాణ డిప్యూటీ సీఎం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఉత్తర తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే లేఖ రాశాడట.. ప్రాంతీయ పార్టీల మాదిరిగా కాంగ్రెస్ లో ఈ నేత మాట్లాడడం అవాంచనీయ పరిణామాలకు దారితీస్తుందంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ గెలవకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఐక్యత దెబ్బతింటుందని.. ఎన్నికల సమయంలో పదవుల గురించి మాట్లాడితే ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందని లేఖలో వివరించాడట..

ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలు గాంధీ భవన్ లో చర్చకు దారితీశాయట.. ఏఐసీసీ నేతల ముందు కూడా సీఎం ఎవరనేది ఎవ్వరూ మాట్లాడరని.. రేవంత్ ఇలా డిప్యూటీ సీఎం ఇతడే అంటూ ప్రకటన చేయడం ఏంటని మిగతా ఆశావాహులు ఫిర్యాదులు చేస్తున్నారట.. కాంగ్రెస్ లో ఇప్పటికే 10 మంది సీఎంలున్నారని టీఆర్ ఎస్ ఆడిపోసుకుంటోందని.. ఇప్పుడు డిప్యూటీ సీఎంపై ఎందుకు నోరుజారాడని ప్రశ్నిస్తున్నారట..

ఇక షబ్బీర్ అలీనే కాదు.. తాము కూడా అర్హులమేనని మైనార్టీ - ఎస్సీ - ఎస్టీ వర్గాలకు చెందిన నేతలు రేసును మొదలుపెట్టారు. ఆయా సామాజికవర్గ నేతల్లో సీఎం స్థాయి నేతలు కాంగ్రెస్ లో ఉన్నారు. వారితోపాటు డిప్యూటీ సీఎం బరిలో కూడా అరడజను మంది సీనియర్లున్నారు. వీరందరిని వదిలి కేవలం షబ్బీర్ అలీనే రేవంత్ పేర్కొనడంపై పార్టీలో తీవ్ర దుమారం రేపినట్టు సమాచారం.