Begin typing your search above and press return to search.

రేవంత్ ఎఫెక్ట్‌ తో టీటీడీపీకి గ‌తం గుర్తుకువ‌స్తోంది

By:  Tupaki Desk   |   25 Oct 2017 11:30 PM GMT
రేవంత్ ఎఫెక్ట్‌ తో టీటీడీపీకి గ‌తం గుర్తుకువ‌స్తోంది
X
తెలంగాణలో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపులు తిరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అనంత‌పురం ప‌ర్య‌ట‌న‌తో ప్రారంభ‌మైన ట్విస్టుల ప‌రంపర‌...తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేరువ అవ‌డంతో తారాస్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. పార్టీ ఫిరాయిస్తున్న‌ట్లు టీడీపీ చెప్తుండగా...త‌న‌పై జ‌రుగుతున్న ప్రచారం స‌రికాద‌ని రేవంత్ అంటున్నారు. ఈ ట్విస్టుల ప‌రంప‌ర కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే...తెలంగాణ టీడీపీ న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డుతోంది. హ‌ఠాత్తుగా త‌న గ‌తాన్ని గుర్తుకు తెచ్చుకుంటోంది.... పాత‌మిత్రుల‌ను క‌ల‌వ‌రిస్తోంది. త‌మ అనుబంధం ఏనాటిదో అంటూ....ఆప్యాయ‌త‌ను ఒల‌క‌బోస్తోంది!

2014 ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ క‌లిసిపోటీ చేసిన‌ప్ప‌టికీ...ఆ ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి ఇరు పార్టీల మ‌ధ్య చీలిక‌లు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీల మ‌ధ్య గ్యాప్ స్ప‌ష్ట‌మైపోయింది. ఒకానొక ద‌శ‌లో రేవంత్ మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ‌లో ఉండి అవ‌స‌రం లేద‌న్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ స్పందిస్తూ...టీడీపీకి త‌మ‌కు పొస‌గ‌డం లేద‌ని....తాము 2019లో ఒంటరి పోరేన‌ని ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామాలు ఇలా కొన‌సాగుతుండ‌గానే రేవంత్ కాంగ్రెస్ పార్టీకి చేరువ అయ్యే ఎపిసోడ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో త‌మ భ‌విష్య‌త్‌ పై బెంగ పెట్టుకున్న టీడీపీ నేత‌లు ఇప్పుడు బీజేపీతో పొత్తు కొన‌సాగించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టార‌ని అంటున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి రేవంత్ చేరువ అవ‌డం - బీజేపీతో స‌ఖ్య‌త‌ - తెలంగాణ టీడీపీ భ‌విష్య‌త్ ప‌యనం వంటి అంశాల‌పై పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్)లో మీడియాతో కొంతసేపు ర‌మ‌ణ‌ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ-టీడీపీ బంధాలు తెగిపోయాయని, రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ చేసిన ప్రకటన గురించి విలేఖరులు ప్రస్తావించగా, అటువంటిదేమీ లేదన్నారు. మిత్రపక్షమైన బీజేపీతో బంధాలు తెగిపోలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్‌రెడ్డి తనతో మాట్లాడుతూనే ఉన్నారని, రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కలిసే ప్రభుత్వాన్ని నిలదీస్తామని ర‌మ‌ణ చెప్పారు. కలిసి పని చేసినా, కలిసి పోటీ చేసినా ఇరు పార్టీలకూ లాభం ఉంటుందన్నారు. బీజేపీతో బంధం ఈనాటిది కాదని, ఏనాటిదోనని నాడు ఎన్టీఆర్ హయాంలో కూడా కలిసి పోటీ చేశామని ఆయన గుర్తు చేశారు.

తమ పార్టీ క్రమశిక్షణను, నియామవళిని ఉల్లంఘించినా క్రమశిక్షణా చర్యలు తప్పవని ర‌మ‌ణ‌ హెచ్చరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళుతున్నట్లు తనకు చెప్పారని, కానీ అక్కడ ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయని అన్నారు. రెండు రోజుల క్రితం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ విషయమై రేవంత్‌రెడ్డిని వివరణ అడిగామన్నారు. కానీ రేవంత్‌ రెడ్డి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే - మాజీ మంత్రి డీకే అరుణ కూడా రేవంత్ తనను కలిసారని చెప్పిన విషయాన్ని రమణ గుర్తు చేశారు. వీటన్నింటిపై రేవంత్‌ రెడ్డి స్పష్టత ఇవ్వకపోతే పదవీ బాధ్యత నుంచి తప్పిస్తామన్నారు. కాగా, ఈ మేర‌కు రేవంత్‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబుకు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే.