Begin typing your search above and press return to search.

ఎర్రమంజిల్‌ లో అసెంబ్లీ.. అంత ఈజీ కాదు కేసీఆర్

By:  Tupaki Desk   |   28 Jun 2019 4:26 PM GMT
ఎర్రమంజిల్‌ లో అసెంబ్లీ.. అంత ఈజీ కాదు కేసీఆర్
X
తెలంగాణ లో కొత్త సెక్రటేరియట్ - అసెంబ్లీల నిర్మాణంపై కేసీఆర్ నేతృత్వంలోని టీఆరెస్ ప్రభుత్వం వేగంగా సాగుతుండగా.. ఆ జోరుకు బ్రేకులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం కావడం - విపక్షాలు పూర్తిగా బలహీనమైపోవడంతో కేసీఆర్ మదిలో ఏమనుకున్నా దాన్ని అమలు చేసుకుంటూ పోతున్నారు. ఆ క్రమంలోనే ఎర్ర మంజిల్‌ లో అసెంబ్లీ కట్టాలని తలపోసి.. అక్కడున్న పురాతన భవనాలు కూల్చే పనికి ప్రణాళికలు వేశారు. అయితే... ఇందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహా పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో ఓ పిటిషనర్ వేసిన వ్యాజ్యంపై వాదనలు విన్న తరువాత హైకోర్టు ఈరోజు తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం బాగానే ఉన్న అసెంబ్లీని వదిలేసి కొత్త అసెంబ్లీ కట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.

ఎర్రమంజిల్ లో పురాతన భవనాలను కూల్చకుండా అడ్డుకోవాలని పిటిషనర్ తన పిటిషన్‌ లో కోరుతూ... హెరిటేజ్‌ కమిటీ నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ఎర్రమంజిల్‌ లో అసెంబ్లీ నిర్మిస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని పిటిషనర్‌ పేర్కొన్నారు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఎర్రమంజిల్‌ ఛాయచిత్రాన్ని హైకోర్టు పరిశీలించింది. ఇరుంమంజిల్ భవనం - హెరిటేజ్ భవనం - చారిత్రాత్మక భవనాన్ని కూల్చడానికి కారణాలేంటని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసెంబ్లీ - సచివాలయం నిర్మాణాలపై ప్రభుత్వం వద్ద ఉన్న ప్లాన్స్... నూతన భవనాల నిర్మాణ అవసరాలపై వివరాలు అందించాలని కోర్టు ఆదేశించింది.

ఆ భవనాలు మరో 50-70 ఏళ్ల వరకు పటిష్ఠంగా ఉంటాయని - వాటిని కూల్చి.. నూతన భవనాలు నిర్మించాలని తలపెట్టడం భారీగా ప్రజాధనం దుర్వినియోగం చేయడమే అవుతుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. భవనాలను కూల్చివేయకుండా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు. సచివాలయ భవనాల కూల్చివేత నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి కూడా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. కొత్త భవనాల కోసం ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేయాలనుకుంటోందని.. కానీ, ఆ అవసరం లేదని.. ఇప్పుడున్న అసెంబ్లీ - సెక్రటేరియట్లు మరో 30 ఏళ్ల వరకు చెక్కుచెదరవని రేవంత్ తన పిటిషన్లో పేర్కొన్నారు. వాస్తు కోసం కేసీఆర్ బంగారంలాంటి అసెంబ్లీ - సెక్రటేరియట్లను కూలగొట్టి కొత్తవి కట్టాలనుకుంటున్నారని అన్నారు. దీనిపై కోర్టు... వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.