Begin typing your search above and press return to search.

కారుకు 100 వస్తే..తెలంగాణ నుంచి వెళ్లిపోతా

By:  Tupaki Desk   |   13 Jan 2016 5:26 AM GMT
కారుకు 100 వస్తే..తెలంగాణ నుంచి వెళ్లిపోతా
X
గ్రేటర్ కాక ఒక్కరోజులో హై పిచ్ కి వెళ్లిపోయింది. ఇప్పటివకూ సో..సోగా నడిచిన ప్రచారం ఒక్కసారి హీటెక్కిపోయింది. నామినేషన్ల ప్రక్రియ షురూ కావటం.. ఎన్నికల్లో సమాయుత్తం కావటానికి.. క్యాడర్ లో ఉత్సాహాన్ని పెంచేందుకు టీటీడీపీ.. బీజేపీ నేతృత్వంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం.. అందులో నేతలు చెలరేగిపోయి మాట్లాడటం జరిగింది. ఇలా మాట్లాడిన వక్తల్లోపలువురు విమర్శలు చేస్తే.. టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ మాత్రం ఎవరూ ఊహించనంత మహా ఛాలెంజ్ విసరటం విశేషం.

గ్రేటర్ కోట మీద గులాబీ జెండా ఎగరటం ఖాయమని.. గ్రేటర్ పరిధిలోని 150 సీట్లలో వందకు పైగా స్థానాల్ని తాము ఒంటరిగా సొంతం చేసుకుంటాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయంటూ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. గ్రేటర్ కోట మీద గులాబీ జెండా ఎగరకుంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ మంత్రి కేటీఆర్ చాలెంజ్ చేస్తే అందుకు ప్రతి సవాలుగా రేవంత్ రెడ్డి తాజాగా మరో సవాల్ విసిరారు.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు 100 సీట్లు వస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటమే కాదు.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటానని.. అంతేకాదు తెలంగాణ గడ్డను వదిలి వెళ్లిపోతానంటూ భీకర ఛాలెజం చేశారు. మంత్రి కేటీఆర్ చేసిన సవాలుకు ప్రతి సవాలుగా రేవంత్ ఇంత భారీ సవాలు విసరటంతో గ్రేటర్ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరినట్లైంది.

టీఆర్ ఎస్ అంటే తెలుగు రాష్ట్ర సమితి అని.. ఆంధ్రాలోనూ పోటీ చేస్తామని కేటీఆర్ అంటున్నారని.. అయితే తాను అంతకు ముందు తెలంగాణ భవన్ ను తెలుగు భవన్ గా మార్చాలని చెప్పనా ఇప్పటివరకూ స్పందించింది లేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కేటీఆర్ నెత్తి మీద రూపాయి పెట్టినా ఎందుకు పనికిరాదు. ఆయన బతుక్కి సీఎం కాదు కదా. ఆంధ్రా ప్రాంతంలోనూ.. విదేశాల్లోనూ చదువుకున్న ఆయన 610 జీవో.. 371(డి) అధికరణాల మేరకు తెలంగాణలో చప్రాసీ ఉద్యోగానికి కూడా పనికి రాడు. ఎక్కడో చదివిన కేటీఆర్ ఇక్కడ మంత్రి కావటమే దైర్భాగ్యం’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణలో టీడీపీ లేదని.. చంద్రబాబు ఏపీకి వెళ్లిపోయాడని చెబుతున్న టీఆర్ ఎస్ నేతలు ఈ సభకు వచ్చిన జనాల్ని చూపించాలని వ్యాఖ్యానించిన రేవంత్.. ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ వచ్చిందే తప్పించి.. తాగుబోతు కేసీఆర్ వల్ల కాదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యిందన్న ఆయన.. కేసీఆర్ సర్కారు విపరీత పోకడల్ని ఎండగట్టేందుకు ఉద్యోగులు.. మావోలు వెనుకాడుతున్నారని.. దళితులు.. మానవహక్కుల సంఘాల వారు కూడా ముందుకు రావటం లేన్నారు. కేసీఆర్ ఎంత నియంతలా వ్యవహరిస్తున్నారో దీన్ని చూస్తే అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ట్యాంక్ బండ్ లో గణపతి నిమజ్జనాలు వద్దంటూ మజ్లిస్ నేత ఒవైసీ ఇచ్చిన ఆదేశాలతోనే కేసీఆర్ పావుతు కదిపారని.. తాము అడ్డుకున్నట్లుగా వ్యాఖ్యానించారు.