Begin typing your search above and press return to search.

సౌత్ ను దోచి నార్త్ కు పెడుతున్నారు రేవంత్ ధ్వజం!

By:  Tupaki Desk   |   5 July 2019 12:32 PM GMT
సౌత్ ను దోచి నార్త్ కు పెడుతున్నారు రేవంత్ ధ్వజం!
X
బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. బడ్జెట్ లో రాష్ట్రాల వారీగా కలిగిన లబ్ధి గురించి ఆయన స్పందించారు. మోడీ ప్రభుత్వం రెండో సారి ఏర్పాటు అయ్యాకా ప్రవేశ పెట్టిన ఈ తొలి బడ్జెట్ లో ఏ రాష్ట్రానికి ఎంత లబ్ధి కలిగింది, ఆ రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఏ మేరకు పన్నులు వెళ్తున్నాయనే అంశం పై రేవంత్ రెడ్డి స్పందించారు.

దక్షిణాది నుంచి ఒక రూపాయి పన్ను తీసుకుంటున్న కేంద్రం అందులో 65 పైసలను మాత్రమే కేటాయిస్తూ ఉందని రేవంత్ అంటున్నారు. అదే బిహార్ విషయంలో రూపాయి పన్నుకు గానూ రూపాయినీ తిరిగి కేటాయిస్తున్నారన్నారు. కానీ యూపీ విషయంలో కథ రివర్స్ లో ఉందని.. అక్కడ నుంచి రూపాయి కి పన్నుకు గానూ రెండు రూపాయల కేటాయింపు జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

సౌత్ కు అలా అన్యాయం చేస్తూ, నార్త్ కు మాత్రం అయాచితమైన లబ్ధి కలిగిస్తూ ఉన్నారని మోడీ సర్కారుపై రేవంత్ విరుచుకుపడ్డారు. ఆర్థిక మంత్రి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తే అయినా ఆమె మోడీ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరించారని రేవంత్ అంటున్నారు.

మరి ఈయన వాదన బాగానే ఉంది కానీ, ఈ అంశంపై మరింత శాస్త్రీయంగా ఆధారాలతో మాట్లాడితే కమలనాథులు ఇరకాటంలో పడే అవకాశం ఉంది. సౌత్ పై చూపిస్తున్న వివక్షతను ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.