Begin typing your search above and press return to search.

హోంమంత్రి హోంగార్డ్‌ కు ఎక్కువ‌ కానిస్టేబుల్‌ కు త‌క్కువ‌

By:  Tupaki Desk   |   4 Feb 2018 2:03 PM GMT
హోంమంత్రి హోంగార్డ్‌ కు ఎక్కువ‌ కానిస్టేబుల్‌ కు త‌క్కువ‌
X
కాంగ్రెస్ పార్టీ నేత‌ - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మ‌రోమారు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దారుణ హత్యకుగురైన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ లక్ష్మీ భర్త శ్రీనివాస్‌ హత్య కేసులో దూకుడుగా వెళుతున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ సంతాప స‌భ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ టీఆర్ ఎస్ తీరును త‌ప్పుప‌ట్టారు. టీఆర్ ఎస్‌ పై పోరాటం చేయడమే శ్రీనివాస్ హత్యకు కారణమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం - పోలీసు వ్యవస్థ బతికే ఉందా అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. హోంమంత్రి నాయిని రేంజ్ హోంగార్డుకు ఎక్కువ కానిస్టేబుల్‌ కు తక్కువ అని సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య వెనుక రాజకీయకుట్ర ఉందని - రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చింది ఒకరైతే అధికారం అనుభవిస్తుంది మ‌రొక‌ర‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును నీరుగార్చడంలో ఆంతర్యమేమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి జగదీష్ రెడ్డి - ఎమ్మెల్యే వీరేశానిది మొదటినుంచి నేరచరిత్రే అని ఆరోపించారు. రంజిత్ - సుధీర్ కాల్ డేటా బయటపెడితే ఎమ్మెల్యే వీరేశం కుట్ర బయటపడుతుందన్నారు. ఉద్యమకారులపై సీఎం కేసీఆర్‌ అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇంత ఘోరం జరిగినా జిల్లా ఎస్పీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతిచేకూరాలని..ఆయన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

పార్టీ సీనియ‌ర్ నేత జైపాల్ రెడ్డి మాట్లాడుతూ బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసు రీ ఓపెన్ చేసి అందరికీ శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. ఈ కేసు దర్యాప్తు సాగుతున్న తీరు అనేక అనుమానాల‌కు తావిస్తోంద‌ని తెలిపారు. సీఎల్పీ ఉప‌నేత‌ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తాము కుడా హత్యా రాజకీయాలు మొదలుపెడితే నల్గొండ మురికి కాల్వాల్లో మీ కార్యకర్తల శవాలు తెలుతాయని హెచ్చ‌రించారు. పిరికి పందల్లా హత్యా రాజకీయాలు చేయడం మానుకోవాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ కు దమ్ముంటే త‌నపై పోటీ చేయాలిని స‌వాల్ విసిరారు. ప్రభుత్వ హస్తంతోనే శ్రీనివాస్ హత్య - ప్రశ్నించే నాయకులను హత్య చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు.