Begin typing your search above and press return to search.

కుమార్తె కవితతో కేసీఆర్ ఆ మాట అన్నారా?

By:  Tupaki Desk   |   7 Nov 2015 4:27 AM GMT
కుమార్తె కవితతో కేసీఆర్ ఆ మాట అన్నారా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ ఫైర్ బ్రాండ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సర్కారు చేతకానితనాన్ని మరింత బాగా అర్థమయ్యేలా చెప్పటంతో పాటు.. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన నోటికి పని చెప్పారు. టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఆయన.. ముఖ్యమంత్రి.. మంత్రుల మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణరాష్ట్ర మంత్రివర్గంలో ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానం కల్పించలేదని విమర్శించిన రేవంత్ రెడ్డి ఒక మాటను చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మహిళలకు మంత్రి పదవులు ఇచ్చామన్న రేవంత్.. టీఆర్ ఎస్ లో 18 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విరుచుకుపడ్డారు. ఆ మధ్య ఎంపీ కవిత తన తండ్రి కేసీఆర్ వద్దకు వెళ్లి మంత్రి పదవి ఇవ్వాలని అడిగారని.. ఈ సందర్భంగా కుమార్తెతో.. ఇప్పుడున్న మంత్రులు మగాళ్లలా కనిపిస్తారా? అని అన్నారంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. వారంతా అటుఇటు కాని మంత్రులు అంటూ దుయ్యబట్టారు.

తెలంగాణలోని అన్ని జిల్లాలను ఒక దొరకు అప్పగించారని రేవంత్ విమర్శిస్తూ.. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. కరవు సహాయక చర్యల్లో టీఆర్ ఎస్ సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు.

టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చెబితే చెప్రాసీ కూడా మాట వినే పరిస్థితి లేదని.. చెప్రాసీ చేత పని చేయించుకోవటానికి కూడా మంత్రి చేత చెప్పించుకుంటున్నారని.. ఎందుకీ బానిస బతుకు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక చెప్రాసీతో పని చేయించుకోవటానికి ఇటీవల ఒక అధికారపక్ష ఎమ్మెల్యే మంత్రి మహిపాల్ రెడ్డితో చెప్పించాల్సి వచ్చిందంటూ ఆరోపించారు. ఇన్ని మాటలు చెబుతున్న రేవంత్ రెడ్డి మాటలు విన్నప్పుడు ఒక డౌట్ రాక మానదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమార్తెతో మాట్లాడిన మాటలు.. రేవంత్ రెడ్డికి ఎలా తెలిసినట్లు..?