Begin typing your search above and press return to search.

ఎంసెట్ లీకేజీలో కేసీఆర్ కుటుంబం!

By:  Tupaki Desk   |   28 July 2016 3:48 PM GMT
ఎంసెట్ లీకేజీలో కేసీఆర్ కుటుంబం!
X
ఎంసెట్ పేపర్ లీకేజీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున ప‌డేసే దిశ‌గా తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడు - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు చేశారు. ఎంసెట్‌-1 - ఎంసెట్-2 ర‌ద్ద‌యిన నేప‌థ్యంలో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ పేప‌ర్ లీకేజీలో సీఎం కేసీఆర్ కుటుంబ స‌భ్యుల పాత్ర ఉంద‌ని ఆరోపించారు. తమ ఆరోప‌ణ‌లు కుట్రలో కేసీఆర్ కుటుంబ స‌భ్యులు లేరని ముఖ్య‌మంత్రి నిరూపించుకోవాలని రేవంత్ స‌వాల్ విసిరారు. తెలంగాణ మంత్రులు క‌డియం శ్రీ‌హ‌రి - ల‌క్ష్మారెడ్డి - తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డిపై ప్ర‌భుత్వం విచార‌ణకు ఆదేశించాల‌న్నారు. విచారణ జరిపిస్తే కేసీఆర్ కుటుంబ స‌భ్యుల మిత్రులు ఇందులో ఉన్నారనే నిజం తెలుస్తోందని భయపడుతున్నారా? అని రేవంత్‌ ప్రశ్నించారు.

ఎంసెట్ లీకేజీ నేప‌థ్యంలో ప‌లు సందేహాలు వ‌స్తుండ‌టం కేసీఆర్ కుటుంబం ఇందులో భాగం పంచుకుంద‌నేందుకు ఆధారంగా ఉన్నాయ‌ని తెలిపారు. టెండర్లు పిలవకుండా ఇంటర్ బోర్డు నిషేధించిన సంస్థకు నామినేటెడ్ పద్ధతిపై కాంట్రాక్టు ఇవ్వడం వల్లే పేపర్ లీకయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంసెట్ పరీక్ష నిర్వ‌హ‌ణ కోసం చేప‌ట్టిన బయోమెట్రిక్ విధానంలో 2,500 మంది విద్యార్థుల బ‌యోమెట్రిక్ ప‌ని చేయ‌క‌పోతే ఆ బాధ్య‌త‌ను చేప‌ట్టిన సంస్థ‌పై స‌ర్కార్ ఎందుకు చ‌ర్య తీసుకోలేదని రేవంత్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఆన్‌లైన్ విధానం కోసం టెండర్ ఇచ్చిన అంశం - ఓఎంఆర్ షీట్ల ప్రింటింగ్‌ - బ‌యోమెట్రిక్ విధానంలో లోపాలు - ఢిల్లీలో ప్ర‌శ్న‌ప‌త్రం ప్రింటింగ్ అయిన అంశాల‌పై స‌మ‌గ్రంగా విచార‌ణ చేప‌ట్టాల‌ని రేవంత్ కోరారు. ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ‌త వ‌ల్లే విద్యార్థుల‌కు ఇన్ని క‌ష్టాలు వ‌స్తున్నాయ‌న్నారు. ఓ వైపు విచార‌ణ జ‌రుగుతోంటే మ‌రోవైపు లీకేజీ జ‌ర‌గ‌లేద‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి వ్యాఖ్య‌లు చేశార‌న్నారు. విచార‌ణ జ‌రుగుతోన్న స‌మ‌యంలో ఆయ‌న అటువంటి వ్యాఖ్య‌లు ఎందుకు చేశార‌ని ప్రశ్నించారు.