Begin typing your search above and press return to search.

రేవంత్ పై కేసీఆర్ అలా కక్ష తీర్చుకుంటన్నారా?

By:  Tupaki Desk   |   30 Jun 2016 7:07 AM GMT
రేవంత్ పై కేసీఆర్ అలా కక్ష తీర్చుకుంటన్నారా?
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్యనున్న రాజకీయవైరం ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఏ చిన్న అవకాశం లభించినా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విరుచుకుపడేందుకు సిద్దంగా ఉండే రేవంత్.. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై గళం విప్పారు. ఈ సందర్భంగా తన మీద కోపంతో తాను ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ స్థానంలోని మండలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు మొత్తం కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసమే అన్నట్లుగా ఏర్పాట్లు సాగుతున్నట్లుగా ఆయన ఆరోపించారు. పక్కపక్కనే ఉన్నా సిద్ధిపేట.. మెదక్ లను జిల్లా కేంద్రాలుగా చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రేవంత్.. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న కారణంగా సిరిసిల్లను కూడా జిల్లా కేంద్రంగా చేస్తున్నారన్నారు.

కేవలం తొమ్మిది మండలాలతో ఉన్న సిరిసిల్లను జిల్లాగా ఎలా చేస్తారంటూ ప్రశ్నించిన రేవంత్.. తన మీద కోపంతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ లోని రెండు మండలాల్ని దూరంగా ఉన్న వికారాబాద్ కేంద్రంగా ఉన్న కొత్త జిల్లాలో కలుపుతున్నట్లుగా తనకు తెలుస్తుందని మండిపడ్డారు. తన మీద కోపం ఉంటే.. తన మీద కక్ష తీర్చుకోవాలే తప్పించి.. ఆ కారణంగా తన నియోజకవర్గంలోని ప్రజల మీద కక్ష తీర్చుకోవటం ఏ మాత్రం సరికాదని ఆయన తప్పుపట్టారు. తాజాగా తనకు అందుతున్న సమాచారం ప్రకారం జిల్లాలు ఏర్పాటు చేస్తే.. తన నియోజకవర్గం రెండు జిల్లాల్లో ఉంటుందని.. అదే జరిగితే ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి అవుతారని ఆయన మండిపడుతున్నారు. ఇంతకీ రేవంత్ రెడ్డికి అందుతున్న సమాచారం సరైనదేనా? అన్న ప్రశ్నకు మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పాలి.