Begin typing your search above and press return to search.

పసిపిల్లల ప్రపంచంలో మహా బకాసురులు

By:  Tupaki Desk   |   12 Oct 2015 3:46 AM GMT
పసిపిల్లల ప్రపంచంలో మహా బకాసురులు
X
ఆంధ్ర వలసపాలకులు గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణ పిలగాళ్లకు దొడ్డు బియ్యం పెడుతూ వచ్చారని, అధికారంలోకి వచ్చిన కొత్తలో విషం చిమ్మిన కేసీఆర్ సన్నబియ్యం పేరుతో వసతి గృహాల పిల్లలను నిలువునా మోసగిస్తున్నారా? తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే - అసెంబ్లీలో టీటీడీపీ ఉప ఫ్లోర్ లీడర్ రేవంత్ రెడ్డి ఆరోపణలను గమనిస్తే, గత కొంత కాలంగా తెలంగాణ విద్యార్థి సంఘాలు చేస్తూవస్తున్న వరుస ఆరోపణలు నిజమేననిపిస్తున్నాయి.

తెలంగాణ వసతిగృహాల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నవన్నీ అసత్యాలని తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి అన్నారు. వసతిగృహాల విద్యార్థులకు దారుణమైన బియ్యంతో అన్నం పెడుతున్నారని... సన్నబియ్యం ముసుగులో రూ.కోట్లలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌ లో విలేకరులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. దొడ్డు బియ్యాన్ని పాలిష్‌ చేసి సన్నబియ్యంగా చెబుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే పాఠశాలలు, వసతిగృహాల్లో బియ్యంపై విజిలెన్స్‌ దాడులు చేయించాలని డిమాండ్‌ చేశారు.

వసతి గృహాల్లో బియ్యం నమూనాలు సేకరించి నాణ్యతను పరీక్షించాలన్నారు. సీఎం కుటుంబ సభ్యులెవరైనా వసతిగృహాల్లో భోజనం చేయగలరా? అని సవాల్‌ చేశారు. అవినీతిని సహించేది లేదని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిపై ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.

సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెడుతున్నట్లు ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పచ్చి బూటకమని తెలంగాణ లోని ప్రతి విద్యార్థి సంఘమూ కోడై కూస్తోంది. ఎవరైనా తనిఖీకి వచ్చిన సందర్భంలో తప్పితే తమకు సన్న బియ్యం పెడుతున్న పాపాన పోవడం లేదని హాస్టల్ విద్యార్థులు గతంలోనే వెల్లడించారు. అవన్నీ బూటకమని ఖండించిన ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపణలకు జవాబు కూడా ఇవ్వక పోవచ్చు.

కాని ఇంత అబద్దాలతో, వంచనతో తెలంగాణ ప్రభుత్వం పాలన సాగించాలా? వలస పాలకుల ఏలుబడిలో సరే... నిఖార్సయిన తెలంగాణ పాలకుల ఏలుబడి కూడా ఇంత దరిద్రంగానే కొనసాగాలా? తమకు చేతకాదన్న విషయం ఒప్పుకోవడానికి ఇన్ని నాటకాలు ఆడాలా? చివరికి పసిపిల్లలకు సంబంధించి అన్నం పెట్టే వ్యవహారంలోనూ అవినీతికి పాల్పడాలా అని రేవంత్ ఆరోపణలు పురస్కరించుకుని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.