Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు సూప‌ర్ స‌ల‌హా ఇచ్చిన రేవంత్‌

By:  Tupaki Desk   |   29 Aug 2016 1:36 PM GMT
కేసీఆర్‌ కు సూప‌ర్ స‌ల‌హా ఇచ్చిన రేవంత్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అటే ఇంతెత్తున ఎగిరిప‌డే తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసీఆర్‌ కు ఉచిత స‌ల‌హా ఒక‌టి ఇచ్చారు. మహారాష్టతో తెలంగాణ‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి నిరసనగా ఆందోళ‌న బాట ప‌ట్ట‌నున్న‌ట్లు టీడీపీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ అనంతరం జలసౌధ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఒక‌వైపు కేసీఆర్ స‌ర్కారుపై ఫైర్ అవుతూనే ఆయ‌న‌కు ఓ ఉచిత స‌ల‌హాను రేవంత్ అంద‌జేశారు.

ధ‌ర్నా సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...ప్రజా పోరాటాల పేరుతో ఎన్నో సార్లు రోడ్లెక్కినా టీఆర్ ఎస్ పార్టీ గణం అధికారంలోకి రాగానే ప్రజాపోరాటాలను హీనంగా చూస్తున్నారనడానికి త‌మ అరెస్టు సన్నివేశాలే దారుణ సాక్షాలని రేవంత్ రెడ్డి మంండిప‌డ్డారు. మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం పేరుతో తెలంగాణ ప్రజలకు పెడుతున్న చారిత్రాత్మక శాపాలను ఎవరూ ప్రశ్నించినా కేసులు పెడతామని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ ప్రకటనలు గుప్పించడం ప్రజల‌కు విస్మ‌యాన్ని క‌లిగిస్తోంద‌ని అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పెట్టిన పరువు న‌ష్టం కేసులపై కోర్టు మొట్టికాయలు వేయడం కూడా కేసీఆర్‌ కళ్లు తెరిపించలేకపోవడం దురదృష్టకరమ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. ముందే మేలుకుంటే... జ‌య‌ల‌లిత లాగా అబాసుపాలు అయ్యే బాధ త‌ప్పుతుంద‌ని అన్నారు. ప్రజల తరపున పోరాడుతున్న నాయకులకు, వారి పోరాటాలకు కనీస మర్యాద ఇచ్చే విధంగా తెరాస ప్రభుత్వం వ్యవహరించకపోతే ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొనే పరిస్థితి తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు.

న్యాయం చేయమని గొంతెత్తిన మల్లన్న సాగర్ నిర్వాసితులపై లాఠీలు - తూటాలు - ప్రయోగించి కర్కశత్వాన్ని చాటుకున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను, ప్రజా ప్రయోజనాలను దెబ్బతీయడంలో అదేజోరు కొనసాగిస్తుండడం శోచనీయమ‌ని రేవంత్‌ మండిప‌డ్డారు. ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్నిపీక నొక్కడంలో కేసీఆర్ సర్కారు ఆరితేరిపోతే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భౌతికంగానే పీకనొక్కడంలో ప్రభుత్వ పోలీసుల జులుం కేసీఆర్ ను మించిపోయిందని దుయ్య‌బ‌ట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ - నీటిపారుదల మంత్రి హరీష్ రావుల ఆదేశాలతో తెలుగుదేశం నేతలను అరెస్టు చేయడానికి దండెత్తి వచ్చిన పోలీసులు తీరును ఖండిస్తున్నామ‌ని తెలిపారు. పోలీసులు మీడియా సాక్షిగా ప్రతిపక్ష నేత పీకనొక్కడం, ప్రశ్నించిన నాయకులకు ప్రభుత్వ పెద్దలు గొంతునొక్కడం పరిపాటిగా మారిపోయిందని ఈ ఘటన రుజువు చేస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు.