Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆంధ్రా ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టిన రేవంత్!

By:  Tupaki Desk   |   6 Jan 2017 4:08 PM GMT
కేసీఆర్ ఆంధ్రా ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టిన రేవంత్!
X
దళితుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ద్వంద్వ వైఖ‌రి అనుస‌రిస్తున్నార‌ని టీడీఎల్పీ నేత ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ద‌ళితుల సమస్యలపై చర్చలోను - దళిత క్రీడాకారులను ప్రోత్సహించడంలోను సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఆంధ్రా ప్రాంత‌వాసుల‌పై అభిమానం చూపుతూ తెలంగాణ బిడ్డలపై సవతి ప్రేమ చూపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ బిడ్డలు పూర్ణ - ఆనంద్ లకు రూ. 25 లకల బహుమానాన్ని ఇచ్చామని సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్నారని అయితే తెలంగాణకు సంబంధంలేని పీవీ సింధుకు రూ. 4 కోట్ల బహుమానాన్ని ఇవ్వడంతో పాటు హైద‌రాబాద్ నగరంలో రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని కూడ కానుకగా ఇచ్చారని రేవంత్ గుర్తుచేశారు. సానియా మీర్జా కోసం కూడ సీఎం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు. ఈ ప్రాంతానికి చెందని పీవీ సింధుకు కోట్ల రూపాయల విలువైన 1000 గజాల స్థలాన్ని కేటాయించిన కేసీఆర్ - తెలంగాణ బిడ్డలైన పూర్ణ - ఆనంద్ లకు కనీసం 200 గజాల స్థలాలనైనా ఇచ్చారా? అని రేవంత్ నిలదీశారు.

అసెంబ్లీలో ఎస్సీ - ఎస్టీ సబ్ ప్లాన్ పై కీలక చర్చ జరుగుతుండగా ఈ చర్చకు సీఎం కేసీఆర్ తో సహా ఆయన కుటుంబీకులు అందరూ ఎందుకు గైర్హాజరు అయ్యారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలలో అన్ని ముఖ్య అంశాలపై చర్చ జరిగే సమయంలో కేసీఆర్ - కేటీఆర్ - హరీష్ రావులు పాల్గొని ముచ్చట్లు చెప్పారని ఇతరులు ఎవరినీ మాట్లాడనివ్వకుండా అన్నీ వారే మాట్లాడారని రేవంత్ గుర్తుచేశారు. అయితే ఎస్సీ - ఎస్టీ సబ్ ప్లాన్ పై చర్చ జరిగే సమయంలో సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ - హరీష్ రావులు కూడ గైర్హాజరు కావడం ఏమ‌టిని ప్ర‌శ్నించారు. దళితులకు సంబందించిన సమస్యలపై చర్చించే సమయంలో సభలో సీఎం లేకపోవడం సబబు కాదని అందుకే సీఎం ను సభకు పిలిపించాలని స్పీకర్ ను కోరినా ఆయన స్పందించలేదని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎస్సీ - ఎస్టీ సబ్ ప్లాన్ పై చర్చ అన్నది దళితుల ఆత్మగౌరవానికి - అభివృద్దికి సంబందించిన అంశం అని దినిని విస్మరించడం దళితులను అవమానించడమేనని రేవంత్ దుయ్యబట్టారు.

దళితుల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధిలేదని వారి సమస్యలు కూడ ఆయనకు పట్టవని రేవంత్ రెడ్డి విమర్పించారు. ఈ కారణంగానే దళిత సంక్షేమానికి సంబందించిన శాఖలను కూడ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి అధీనంలో పెట్టారని ఆయన ఆరోపించారు. దళితులపై సవతి ప్రేమ చూపడం మానుకోవాలని, వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని రేవంత్ హితవు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/