Begin typing your search above and press return to search.

దోస్తు కోసం చ‌ట్టాన్నే మార్చేసిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   16 April 2017 4:25 AM GMT
దోస్తు కోసం చ‌ట్టాన్నే మార్చేసిన కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రిపై టీటీడీపీ ప్లోర్ లీడర్ రేవంత్ రెడ్డి మ‌రోమారు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అట్ట‌హాసంగా తెస్తున్న వారసత్వ సంపద పరిరక్షణ బిల్లు వెనుక మ‌త‌ల‌బు త‌న ఆప్త‌మిత్రుడైన మైహోం సంస్థ‌ల అధిప‌తి జూప‌ల్లి రామేశ్వరరావుకు మేలు చేసేందుకేన‌ని రేవంత్ ఆరోపించారు. జీవో 542 క్లాజ్ 13 లో హైదరాబాద్ లోని వారసత్వ సంపదను నోటిఫై చేశారని తెలిపారు. `రామేశ్వరరావుకు రాయదుర్గంలో సర్వే నెంబర్ 83/1 లో కేటాయించిన భూములు కూడా వారసత్వ సంపద జాబితాలో ఉన్నాయి. దీనిపై గతంలో నేను పోరాడాను. దీంతో రామేశ్వరరావు సంస్థకు అనుమతులు పెండింగ్ లో పెట్టారు. ఆ తర్వాత జీవో నెంబర్ 183 ద్వారా క్లాజ్ 13 రద్దు చేశారు` అని వివ‌రించారు. ఈ ప‌రిణామాల‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోని రామేశ్వరరావు అనుమతులకు లైన్ క్లియర్ చేశారని రేవంత్ వివ‌రించారు.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జ‌రిగిన ఈ తంతుపై తాను త్వ‌ర‌లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించబోతున్నాన‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. త‌న‌ ఫోన్ ట్యాప్ చేయ‌డం ద్వారా ఈ సమాచారం ప్రభుత్వ పెద్దలు తెలుసుకున్నారని రేవంత్ ప్ర‌క‌టించారు. అందుకే హడావుడిగా వారసత్వ బిల్లు తీసుకువస్తున్నారని తెలిపారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కాగా, బీఏసీ స‌మావేశానికి ఆహ్వానం ప‌లికి అనంత‌రం వెళ్ల‌గొట్టిన ఘ‌ట‌న‌పై రేవంత్ మండిప‌డ్డారు. ఒక్కరోజు అసెంబ్లీ జరగనున్న నేపథ్యంలో ఇవాళ బీఏసీ సమావేశం జరిగింది. అయితే దీనికి హాజ‌రైన రేవంత్‌ ను స‌భ నుంచి స‌స్పెన్ష‌న్‌ కు గుర‌యినందున బీఏసీకి హాజ‌రు కావ‌ద్ద‌ని చెప్ప‌డంతో షాక్ తిన్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో స్పీకర్‌‌-సీఎం కేసీఆర్‌‌ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము ఏ తప్పూ చేయకపోయినా ప్రభుత్వం మాత్రం మమ్మల్ని శిక్షించే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందని మండిప‌డ్డారు. ఆ నిర్ణయాలను సమర్థించే విధంగా స్పీకర్ కార్యాలయ వ్యవహార శైలి ఉన్నదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/