Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు ఫైర్ బ్రాండ్ విసురుతున్న సవాళ్లు ఏమంటే?

By:  Tupaki Desk   |   9 Jun 2020 5:15 AM GMT
కేటీఆర్ కు ఫైర్ బ్రాండ్ విసురుతున్న సవాళ్లు ఏమంటే?
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర అధికారపక్ష అధినేత మీదా.. ఆయన కుటుంబ సభ్యుల మీదా ఎలా పడితే అలా ఆరోపణలు చేసే అవకాశం లేదు. గతంలో ఎప్పుడూ లేనంత కఠినంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇలాంటివేళలో కాలక్షేపం కోసం విమర్శలు.. ఆరోపణలు చేస్తే అడ్డంగా బుక్ కావటం ఖాయం. ఇలాంటివేళలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కమ్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మీద వరుస పెట్టి ఆరోపణలు గుప్పిస్తున్న రేవంత్.. తాజాగా మరిన్ని ఆరోపణల్ని తెర మీదకు తీసుకొచ్చారు. జన్వాడలో మంత్రి కేటీఆర్ కు భూములు లేవన్న వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. జన్వాడ లో కేటీఆర్ కు 301-13 సర్వే నెంబర్లలో భూములు లేవనటం అబద్ధమని.. ఎందుకంటే జన్వాడ లో భూములు ఉన్నట్లు కోర్టుకు పోలీసులే నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు.

ఈ ఊళ్లో తనకు భూములు ఉన్నట్లుగా కేటీఆరే స్వయంగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. జన్వాడ గ్రామంలో తనకు రెండు ప్రాంతాల్లో భూములు ఉన్నట్లు చెప్పారని.. ఆయన నిబంధనల్ని ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. కేటీఆర్ కున్న ఫామ్ హౌస్ కేటీఆర్ సొంతం కాదని.. దాన్ని లీజుకు తీసుకున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పటాన్ని గుర్తు చేశారు.

2019 మార్చి ఏడున 301 సర్వే నెంబరులో 2 ఎకరాలు కేటీఆర్ సతీమణి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిందన్నారు. 2018 ఎన్నికల అఫిడవిట్లో రూ.2 కోట్లు విలువైన ఆస్తుల్ని జన్వాడ ఆర్చనా వెంచర్స్ పేరు మీదా ఉన్నట్లు కేటీఆరే స్వయంగా ప్రకటించిన వైనాన్ని గుర్తు చేశారు. తానేమీ నోటికి వచ్చినట్లు మాట్లాడటం లేదని.. ప్రతి దానికి ఒక ఆధారం ఉందన్నట్లుగా రేవంత్ మాటలు ఉన్నాయి. మంత్రి కేటీఆర్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టిన ఫైర్ బ్రాండ్.. తాజాగా ఆయన్ను తన పదునైన ఆరోపణలతో ఇరుకున పెట్టారన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. ఆయన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి?