Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ విప్పిన గ్లోబ‌రీనా గుట్టు!

By:  Tupaki Desk   |   1 May 2019 5:16 AM GMT
ఫైర్ బ్రాండ్ విప్పిన గ్లోబ‌రీనా గుట్టు!
X
సండేనాడు సోష‌ల్ మీడియాలో టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రెండు గంట‌ల పాటు గ‌డ‌ప‌టం.. ఆస్క్ కేటీఆర్ పేరుతో ఆయ‌న నిర్వ‌హించిన ప్రోగ్రాంలో.. గ్లోబ‌రీనా సంస్థ పేరే విన‌లేద‌ని.. ఆ సంస్థ గురించి త‌న‌కు తెలీద‌ని ఆయ‌న చెప్పారు. అప్ప‌టి నుంచి గ్లోబ‌రీనాతో కేటీఆర్ కున్న సంబంధాల‌పై రాజ‌కీయ ర‌గ‌డ మొద‌లైంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఇదే ఇష్యూ మీద కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గ‌ళం విప్పారు.

గ్లోబ‌రీనాకు సంబంధించిన కొత్త గుట్టును విప్పే ప్ర‌య‌త్నం చేశారు. గ్లోబ‌రీనా సంస్థ‌కు.. ఎంసెట్ 2 స్కాం పాల్ప‌డిన మ్యాగ్న‌టిక్ ఇన్ఫోటెక్ సంస్థ ఒక్క‌టేన‌న్న కొత్త విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. అంతేకాదు.. స‌ద‌రు సంస్థ డైరెక్ట‌ర్ విజ‌య‌రామారావు అల్లుడు ప్ర‌ద్యుమ్న‌.. కేటీఆర్ ఇద్ద‌రూ క్లాస్ మేట్ అంటూ కొత్త విష‌యాన్ని వెల్ల‌డించారు. రేవంత్ రెడ్డి మాట‌ల‌తో గ్లోబ‌రీనా గురించి త‌న‌కు అస్స‌లు తెలీదంటూ కేటీఆర్ మాట‌ల్లో నిజం లేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

సంచ‌ల‌నంగా మారిన రేవంత్ రెడ్డి.. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రిన్ని విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు. ఆయ‌నేం చెప్పార‌న్న‌ది ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..

+ కేటీఆర్‌ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే గ్లోబరీనాకు ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కాంట్రాక్టును కట్టబెట్టారు.సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌’ (సీజీజీ)ను కాదని అర్హత లేని గ్లోబరీనాకు కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వ సంస్థను కాదని ప్రైవేటు సంస్థలకు టెండర్లు ఎలా వెళ్లాయి?

+ గ్లోబరీనా సంస్థతో సంబంధాలు లేవని చెప్పినంత మాత్రాన తప్పించుకోలేవు. గతంలో పరీక్షల నిర్వహణ పారదర్శకంగా ఉండేందుకు హాల్‌టికెట్ల జారీ.. జవాబు పత్రాల వాల్యుయేషన్‌ - ఫలితాల ప్రకటనను మూడు దశలుగా విభజించి ఒక్కో దశను ఒక్కో సంస్థకు అప్పజెప్పేవారు.

+ 1996 నుంచి 2016 వరకు ఇదే విధానాన్ని పాటించారు. ఇంటర్‌ పరీక్షలను సీజీజీ నిర్వహించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఎక్కడా ప్రశ్నపత్రాలు లీక్‌ కాలేదు. కానీ, తెలంగాణ ప్రభుత్వం మూడు దశలనూ గ్లోబరీనాకే కట్టబెట్టింది. ఎంసెట్‌-2 స్కాంకు పాల్పడిన మ్యాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌ - గ్లోబరీనా ఒక్కటే.

+ 2016లో తెలంగాణ ఎంసెట్‌ లీకేజీ వెనక మ్యాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌ ప్రధాన పాత్ర పోషించింది. ఆ సంస్థ డైరెక్టర్‌ విజయరామారావు అల్లుడు ప్రద్యుమ్న కేటీఆర్‌ క్లాస్‌ మేట్‌. మ్యాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌ లో ప్రద్యుమ్న కూడా ఓ డైరెక్టర్‌. అందుకే మూడేళ్లు గడుస్తున్నా ఎంసెట్‌ లీకేజీ కేసులో మ్యాగ్నటిక్‌ సంస్థ అధిపతులపై కేసులు లేవు. కేటీఆర్‌ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఎంసెట్‌ పరీక్షల కాంట్రాక్టును మ్యాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌ దక్కించుకుంది.

+ మ్యాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌.. గ్లోబరీనా సంస్థల పేర్లు మాత్రమే వేరు. ఆ రెండు సంస్థలకు యజమానులంతా ఒక్కటే. ఈ రెండు కలిసి జేఎన్‌ టీయూ-కాకినాడను మోసం చేశాయి. వాటిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. కేటీఆర్‌ కు మ్యాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌ తెలిసినప్పుడు గ్లోబరీనా తెలియదని అనడం సరికాదు.