Begin typing your search above and press return to search.

కేసీఆర్ తో జాగ్ర‌త్త‌..మీడియాకు రేవంత్ హెచ్చ‌రిక‌!

By:  Tupaki Desk   |   29 Sep 2018 1:16 PM GMT
కేసీఆర్ తో జాగ్ర‌త్త‌..మీడియాకు రేవంత్ హెచ్చ‌రిక‌!
X
తెలంగాణ‌లో ఆప‌ద్ధ‌ర్మ‌ సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి - రేవంత్ రెడ్డికి మ‌ధ్య గ‌త నాలుగేళ్లుగా మాట‌ల యుద్ధం కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. సంద‌ర్భానుసారంగా కేసీఆర్ - కేటీఆర్ - క‌విత‌ - హ‌రీష్ ల‌పై రేవంత్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే రేవంత్ ఓటుకు నోటు కేసులో దొరికిపోవ‌డంతో....రేవంత్ ఇరుకున ప‌డ్డారు. ఆ కేసు వ్య‌వ‌హారంతో రేవంత్ కొద్దిగా సైలెంట్ అయ్యారు. ఆ త‌ర్వాత పార్టీ మారిన‌ రేవంత్...మ‌ళ్లీ దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లుపెట్టారు. ఈ నేప‌థ్యంలోనే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ముందు త‌న‌పై కేసీఆర్ ఐటీ దాడులు నిర్వ‌హించార‌ని రేవంత్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఆ ఐటీ దాడుల త‌ర్వాత మీడియా స‌మావేశం నిర్వ‌హించిన రేవంత్... మీడియాను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ ఆడుతున్న రాజ‌కీయ చ‌ద‌రంగంలో మీడియా పావు కావ‌ద్ద‌ని రేవంత్ అన్నారు. త‌న‌ను కేసీఆర్ త‌ప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నార‌ని - మీడియా త‌మ ఆత్మ ప్ర‌బోధం ప్ర‌కారం త‌న‌పై పెట్టిన అక్ర‌మ కేసుల గురించి ఆలోచించాల‌ని కోరారు.

గ‌తంలో తాను కేసీఆర్ చేస్తున్న అవినీతి - అక్ర‌మాల‌పై గ‌ళ‌మెత్తాన‌ని.... కేసీఆర్ స‌ర్కార్ చేస్తున్న కుంభ‌కోణాల‌ను - స్కామ్ ల‌ను బ‌య‌ట‌పెట్టాన‌ని... అందుకే త‌న‌పై కేసీఆర్ క‌క్ష సాధిస్తున్నార‌ని రేవంత్ అన్నారు. త‌న‌ను రాజ‌కీయంగా నేరుగా ఎదుర్కొనలేక కేసీఆర్ ఈ త‌ర‌హా చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని అన్నారు. త‌న‌ను అసెంబ్లీ నుంచి బ‌హిష్క‌రించాల‌ని చూసేవార‌ని - ఇపుడు ముంద‌స్తు ఎన్నిక‌ల ముందు త‌న‌ను కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టేందుకు ఈ దాడులు చేయించార‌ని అన్నారు. ఈ రోజు కేసీఆర్ అధికారంలో ఉన్నార‌ని...అందుకే త‌న‌పై ఐటీ - ఈడీ దాడులు చేయించార‌ని....రేపు త‌మ‌దైన రోజొక‌టి వ‌స్తుంద‌ని....రేవంత్ అన్నారు. కాబ‌ట్టి - జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను మీడియా నిశితంగా ప‌రిశీలించాల‌ని - త‌మ మ‌న‌స్సాక్షి చెప్పిన‌ట్లు పాత్రికేయులు న‌డుచుకోవాల‌ని కోరారు. కేసీఆర్ ఆడే ఆట‌లో పావులు కావ‌ద్ద‌ని మీడియాను హెచ్చ‌రించారు.