Begin typing your search above and press return to search.

రేవంత్‌ను న‌మ్ముకున్నోళ్లంతా భ‌గ్గుమంటున్నారు

By:  Tupaki Desk   |   18 May 2018 12:56 AM GMT
రేవంత్‌ను న‌మ్ముకున్నోళ్లంతా భ‌గ్గుమంటున్నారు
X
తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌కి వెళ్ళి అక్క‌డ జెండా పాతాల‌ని డిసైడ‌న కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.తెలుగుదేశం పార్టీలో రాజకీయం చేసిన౦త సులువు కాదు కాంగ్రెస్ లో రాజకీయం చెయ్యడం అంటే అనే విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ దూకుడుగా నిర్ణ‌యం తీసుకున్న రేవంత్ రెడ్డి ఆ పార్టీ గూటికి చేరారు. చ‌ర్చ‌ల ఫ‌లిత‌మో లేదా భారీ ఆశలపై భ‌రోసానో కానీ ఆయ‌న కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. అక్కడి నుంచి ఆయనకు కష్టాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అవి తారాస్థాయికి చేరాయ‌ని స‌మాచారం. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రేవంత్ వెంట పార్టీ మారిన నేతలు ఇప్పుడు రేవంత్ పై అసహనంగా ఉన్నారని తెలుస్తోంది. ఆయనను నమ్ముకుని వెళ్తే కనీస గౌరం కూడా అక్కడ దొరకడం లేదని స‌మాచారం.

స్వ‌ల్పకాలంలోనే అంద‌లం ద‌క్కించుకున్న రేవంత్ రెడ్డికి ఆయ‌నతో పాటుగా న‌డిచిన నేత‌ల‌కు టీడీపీ అచ్చివ‌చ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కావడంతో నేతలకు గాని వారి మద్దతు దారులకు గాని ఒకింత గౌరవం ఉండేది. అయితే తెలంగాణ‌లో తెలుగుదేశం అడ్ర‌స్ గ‌ల్లంత‌వ‌డం, కాంగ్రెస్ పార్టీకే భ‌విష్య‌త్ క‌నిపించిన నేప‌థ్యంలో కొంద‌రు నేత‌లు రేవంత్‌తో క‌లిసి కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. చేరిక సంద‌ర్భంగా రేవంత్‌కు పెద్ద ప‌ద‌వులే ఆశ క‌ల్పించారు. అంతేకాకుండా ఆయన అనుచరులకు కూడా పదవుల హామీ ఇచ్చారు. అయితే ఇటు రేవంత్‌కు అటు ఆయ‌న‌తో న‌డిచిన వారికి ఆశించింది జరగలేదు. ఎందుకంటే..జాతీయ పార్టీలు దాదాపు సముద్రంతో సమానంగా ఉంటాయి. అలాంటి పార్టీల్లో రాజకీయం చెయ్యడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు క‌దా! దీంతో రేవంత్‌తో వెళ్లిన‌ వారిలో అసహనం మొదలయిందని తెలుస్తోంది.

త‌మ సీనియారిటీ కంటే ఘోర‌మైన గౌర‌వాన్ని తాము పొందాల్సి వ‌స్తోంద‌ని వారు వాపోతున్న‌ట్లుగా స‌మాచారం. రేవంత్‌తోపాటు చేరిన వారిలో పలుమార్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా...పని చేసిన వారితోపాటు టీడీపీలో కీలకమైన స్థానాల్లో పని చేసిన వారు ఉన్నారు. వారు పార్టీలో చేరుతున్న స‌మ‌యంలో ముఖ్యమైన ముగ్గురు నలుగురికి ఏఐసీసీ సభ్యులు, కొందరికి టీపీసీసీ కార్యదర్శులు, మరికొందరికి టీపీసీసీ అనుబంధ సంఘాలైన యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐ, మహిళా కాంగ్రెస్‌, ఎస్సీ, ఎస్టీ సెల్‌లు, ఐటీ విభాగాల్లో ఏదో ఒక స్థాయి స్థానాలు కోరారు. అయితే వారికి ప‌ద‌వులు ఏమీ ద‌క్క‌లేదు. ఈ నేపథ్యంలో రేవంత్ పై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. రేవంత్ పెద్ద పెద్ద పదవులు అడగడం లేదని, చిన్న ప‌ద‌వుల‌న‌యినా క‌ట్ట‌బెట్టి స్థితిలో ఉంటే కాంగ్రెస్‌లో చేరి ప్ర‌యోజ‌నం ఏంట‌ని స‌ద‌రు నేత‌లు ఒత్తిడి పెంచుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.