Begin typing your search above and press return to search.

రేవంత్ 'ప్లాన్ బీ' మొద‌లైంది

By:  Tupaki Desk   |   13 Dec 2016 6:29 AM GMT
రేవంత్ ప్లాన్ బీ మొద‌లైంది
X
తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభాపక్ష నేత రేవంత్‌ రెడ్డి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త త‌ర‌హాలో పోరాటం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. రాబోయే అసెంబ్లీ స‌మావేశం నేప‌థ్యంలో శాసనసభ్యులు సమావేశమై శాసనసభలో ప్రస్తావించాల్సిన అంశాలపై తెలంగాణ టీడీపీ శాస‌న‌స‌భాప‌క్షం స‌మావేశం అయింది. అనంతరం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని, దీనిపై శాసనసభలో నిలదీస్తామని చెప్పారు. తెరాస ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ళు గడిచినా రైతులు - విద్యార్థులు - పేద ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఘోరంగా విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు. అవినీతి - అసమర్థ పరిపాలనతో ప్రజలు కష్టాల పాలయ్యారని - దీనిపై తమ పార్టీ పోరాటం చేస్తుందని స్ప‌ష్టం చేశారు.

రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. తమ పార్టీ ప్రతినిధి బృందం 13 - 14 తేదీల్లో ఢిల్లీలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సహాయం కోరనున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.780 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఖర్చు చేయని విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళతామని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వంలో కేవలం ఇద్దరు - ముగ్గురి పెత్తనమే నడుస్తోందని, దీంతో ప్రభుత్వ పరిపాలన కుంటుపడుతోందని రేవంత్‌ రెడ్డి చెప్పారు.

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువు మానేయాల్సి వస్తోందని ఆర్‌.కృష్ణయ్య ఆందోళన వ్యక్తంచేశారు. ఫీజు రీయింబర్స్‌ కోసం ఏడాది నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. మరోవైపు సంక్షేమ హాస్టళ్ళ దుస్థితి దీనావస్తకు చేరిందని, హాస్టళ్ళలో ఉంటున్న పేద విద్యార్థులు తీరని కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం నుంచి పార్టీ ఫిరాయించిన వారికి సంబంధించి 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్ర హైకోర్టు శాసనసభ స్పీకర్‌ ను ఆదేశించినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/