Begin typing your search above and press return to search.

ఉత్తమ్, కాంగ్రెస్ తీరు పై రేవంత్ రెడ్డి అసంతృప్తి..

By:  Tupaki Desk   |   19 March 2020 1:30 PM GMT
ఉత్తమ్, కాంగ్రెస్ తీరు పై రేవంత్ రెడ్డి అసంతృప్తి..
X
కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న కుమ్ములాటలు పార్టీని దెబ్బతీస్తున్నాయి.. కార్యకర్తల్లారా మీరు వాటిని పట్టించుకోకుండా అధికార పార్టీ అవినీతి, అక్రమాలపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సూచించారు. అయితే అరెస్టై తాను జైల్లో ఉంటే పరామర్శించడానికి నాయకులు రాకపోవడాన్ని తప్పుబట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి సరికాదని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీలోని నేతలు సమన్వయంతో, ఏకాభిప్రాయంతో సమష్టిగా పోరాటం చేయడం లేదనే అపోహ ప్రజల్లో కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్‌ ఫామ్‌హౌ్‌స్ పై డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన కేసులో అరెస్టయి బెయిల్ పై బుధవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసానికి చేరుకున్న కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించాల్సి ఉండేదని అభిప్రాయ పడ్డారు. తన అరెస్ట్ తో జన్వాడ ఫామ్‌హౌస్‌ ముట్టడికి పిలుపునిచ్చి ఉంటే కార్యకర్తల్లో ఉత్తేజం నిండేదని తెలిపారు. అయితే తాను అరెస్టై చర్లపల్లి జైలులో ఉంటే ఉత్తమ్‌ పరామర్శకు రాలేదని గుర్తుచేసి ఇదే విషయమై జైలులో ఖైదీలు అడిగారని తెలిపారు. కార్యకర్తలారా.. నాయకులపై మీరు ఒత్తిడి చేయండని చెప్పారు. గతంలో నాయకుల ఆదేశాల మేరకు కార్యకర్తలు పని చేసేవారు.. కానీ ఇప్పుడు మీరే నాయకులను ఆదేశించి ప్రభుత్వ తీరుపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అవినీతి, అక్రమాలపై పోరాటం కోసంనాయకులపైనే కార్యకర్తలు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అయితే కేసీఆర్‌ పెద్ద బలవంతుడేమీ కాదని, కాంగ్రెస్ పార్టీలో తామందరం కలిసికట్టుగా లేకపోవడమే కేసీఆర్ బలమని పేర్కొన్నారు. కేసీఆర్‌ అవినీతిపై పోరాటంలో భాగంగా భూలావాదేవీలకు సంబంధించి కార్యాచరణ బాధ్యత తనకు, సాగునీటి రంగంలో దోపిడీ పై కార్యాచరణ బాధ్యత ఉత్తమ్‌ కు ఖుంటియా అప్పగించారని వివరించారు. ఇక టీఆర్‌ఎస్‌ దోపిడీ వివరాలను కాగితాల రూపంలో విడుదల చేస్తానని.. మరో పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.