Begin typing your search above and press return to search.

ఈ మీసాలు మెలేయటం ఏంది రేవంత్‌?

By:  Tupaki Desk   |   10 Jun 2015 9:54 AM GMT
ఈ మీసాలు మెలేయటం ఏంది రేవంత్‌?
X
ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా బుక్‌ అయ్యారన్న విషయం కన్ఫర్మ్‌ కావటానికి కాసేపటి ముందు టీవీల్లో రేవంత్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారన్న బ్రేకింగ్‌ న్యూస్‌ రావటం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ఓ ఆసక్తికరమైన సంఘటనను ఎవరూ మర్చిపోలేరు.

టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారన్న విషయంపై స్పష్టత వచ్చి.. అధికారులు రేవంత్‌ను అధికారికంగా అరెస్ట్‌ చేసి తరలించే సమయంలో రేవంత్‌రెడ్డి వీరావేశంతో మీసాలు తిప్పటం.. తనను ఏ పోలీసుల చేత అయితే అరెస్ట్‌ చేశారో అదే పోలీసుల చేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అరెస్ట్‌ చేస్తానంటూ ప్రతిన పూనారు.

ఆ సీన్‌ చూసిన వారంతా.. రేవంత్‌ చేసిన శపధంపై ఆలోచనలో ఉండగానే టీవీ స్క్రీన్‌లపై మరోసీన్‌ కనిపించింది. స్టీఫెన్‌సన్‌కు డబ్బు కట్టలు అందజేస్తున్న రేవంత్‌రెడ్డి వీడియో రాగానే షాక్‌ తినటం జనాల వంతైంది. ఓపక్క రేవంత్‌ మీసం మెలేయటం.. మరోవైపు డబ్బు కట్టలతో అడ్డంగా బుక్‌ అయిపోయిన రెండు ఫ్రేములు ఒకే స్క్రీన్‌ మీద కనిపించాయి.

ఇది జరిగి దాదాపు పన్నెండు రోజులు గడిచిన తర్వాత ఏసీబీ కస్టడీ నుంచి మళ్లీ జైలుకు వెళుతున్న రేవంత్‌రెడ్డి మరోసారి మీసం మెలేశారు. గతంలో మీసం మెలేయటంతో పాటు డైలాగులు చెప్పిన రేవంత్‌.. ఈసారి మాత్రం కేవలం యాక్షన్‌ మాత్రమే చేశారు కానీ డైలాగులు చెప్పలేదు. కాకపోతే.. ఈ సీన్‌ చూసిన వారిలో కొందరు మాత్రం.. మొదటిసారి మీసం మెలేశాడు.. వీడియో విడుదలైంది. మరి.. ఈసారి మీసం మెలేశాడు.. ఇంకేం విడుదలవుతుందో అన్న వ్యాఖ్యలు వినిపించాయి. అయినా.. ఏం ఘనత సాధించారని ఈ మీసం మెలేయటాలో..?