Begin typing your search above and press return to search.

గులాబీ బ్యాచ్ ను రేవంత్ అంతలా ఇరిటేట్ చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   5 Oct 2021 3:42 AM GMT
గులాబీ బ్యాచ్ ను రేవంత్ అంతలా ఇరిటేట్ చేస్తున్నాడా?
X
సరైన ప్రత్యర్థి ఎదురుకానప్పుడు ఆట అంత రసవత్తరంగా ఉండదు. సాదాసీదా ఆటగాళ్లతో ఆడటం కాస్తంత విసుగే అయినా ఇట్టే విజయం వచ్చి పడుతుంది. ఇలాంటివేళలో.. సరైనోడు తగిలినంతనే గెలుపు సంగతి తర్వాత.. ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి కావటం ఖాయం. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు మంత్రి కేటీఆర్ అండ్ కో. టీపీసీసీ చీఫ్ బాధ్యతల్ని రేవంత్ కు అప్పజెప్పిన నాటి నుంచి గడిచిన ఏడున్నరేళ్లలో ఎప్పుడూ పడనంత ఒత్తిడికి లోనవుతున్న తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఈ కారణంతోనే రేవంత్ పై చేస్తున్న వ్యాఖ్యల తీరు ఎప్పటికప్పుడు మారిపోతోంది. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టి.. పదవిని సొంతం చేసుకున్నాడన్న విషయం ప్రత్యర్థి పార్టీలు ప్రధాన అస్త్రంగా వాడేసే పరిస్థితి ఉందంటే.. సదరు నేత అధికార పార్టీని ఎంతలా ఇబ్బంది పెడుతున్నారన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. తాజాగా రేవంత్ చేపట్టిన నిరుద్యోగ జంగ్ నిరసనను తాజాగా మంత్రి కేటీఆర్ తేలిగ్గా తీసి పారేశారు. జంగ్ లేదు సైరన్ లేదు.. అది జంగు పట్టిన పార్టీ అంటూ మండిపడిన కేటీఆర్.. ‘తుపాకీ లేదు.. ఉత్తి తుపేల్ పార్టీ’ అని కొట్టిపారేశారు.

నిజంగానే అంత తుపేల్ పార్టీనా? అంటే.. కాదనే చెప్పాలి. ఎందుకంటే.. శనివారం చేపట్టిన నిరుద్యోగ జంగ్ వేళ.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్ని వదిలేస్తే.. హైదరాబాద్ లో పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసేందుకు ఉదయం పది గంటలు మొదలు సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు సాయంత్రం వేళలో పూల దండ వేయటంలో విజయం సాధించారు. ఈ క్రమంలో పోలీసుల చేత దెబ్బలు తిన్న వారు.. ఒంటి మీద లాఠీ వాతలు పడినోళ్లు చాలామందే ఉన్న పరిస్థితి. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా.. తమ నిరసనను చేపట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రదర్శించిన తెగువు ఇప్పుడా పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.

అదే సమయంలో.. ఈ నిరసనను సింఫుల్ గా తీసి పారేసేలా మంత్రి కేటీఆర్ మాట్లాడటం చూస్తే.. ఆయన మీద ఎంత ప్రభావం చూపిస్తే తప్పించి.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు రేవంత్ మీద లేని కొత్త ఆరోపణల్ని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో బాబు పంచన ఉండి తుపాకీ పట్టుకొని ఉద్యమకారులపై రేవంత్ రెడ్డి వెళ్లారంటూ కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. చంపిసోడే సంతాపం తెలిపినట్లు.. శ్రీకాంతాచారి విగ్రహానికి రేవంత్ పూలదండ వేశారని.. తెలంగాణకు మొదటి ద్రోహి రేవంత్ అని విరుచుకుపడ్డారు.

ఏఐసీసీ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ కు రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి తన పార్టీ పదవిని తెచ్చుకున్నారంటూ మండి పడుతున్న కేటీఆర్ మాటల్ని చూస్తే.. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ బాగానే ఇరిటేట్ చేస్తున్నారన్న భావన కలుగక మానదు. గులాబీ నేతల నోటి నుంచి తిట్లు తింటున్నా.. అవన్నీ కూడా రేవంత్ సాధించిన విజయాలుగా చెప్పక తప్పదు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ తెలంగాణలో లేదనే వ్యాఖ్యల స్థానే.. తీవ్ర ఆరోపణలు చేస్తున్న తీరు చూస్తే.. తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.