Begin typing your search above and press return to search.

రేవంత్ వ‌ల్ల ర‌చ్చ ముదురుతోంది

By:  Tupaki Desk   |   22 July 2016 11:29 AM GMT
రేవంత్ వ‌ల్ల ర‌చ్చ ముదురుతోంది
X
ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ- బీజేపీల మధ్య దూరం పెరుగుతోంది. తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం ఉద్యమాలు చేస్తుంటే.. కమలం పార్టీ మాత్రం సొంత అజెండాతో ముందుకు పోతోందనే భావ‌న‌కు ఇపుడు వ్య‌క్తిగ‌త అంశాలు తోడ‌య్యాయి. నిన్నటి వరకూ ఆ రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన‌ప్ప‌టికీ టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డి వ‌ల్ల మైత్రి బంధం మ‌రింత బీటలు వారింద‌ని చెప్తున్నాయి.

బీజేపీ-టీడీపీలు గ్రేటర్‌ ఎన్నికల వరకూ భాయి భాయీ అంటూ పెనవేసుకుని తిరిగిన సంగ‌తి తెలిసిందే. కానీ ఇపుడు వాటి మ‌ధ్య దూరం పెరిగింది. అందుకు రేవంత్ వేసిన అడుగే కార‌ణమ‌ని బీజేపీ నేత‌లు అంటుండ‌టం ఆస‌క్తిక‌రం. ఈ మధ్యే బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీవీపీకి చెందిన కొంతమంది విద్యార్థులు టీడీపీ అనుబంధ‌మైన‌ టీఎన్‌ఎస్‌ఎఫ్‌లో చేరారు. రేవంత్ రెడ్డి స్వ‌యంగా వీరీకి కండువాలు క‌ప్పారు. ఈ ప‌రిణామంపై బీజేపీ అగ్గిమీద గుగ్గులమవుతోంది. మైత్రిని గౌర‌వించాల్సింది పోయి స్వ‌యంగా ఫ్లోర్ లీడ‌ర్ కం కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడే కండువాలు క‌ప్ప‌డం ఏంట‌ని బీజేపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాలను కూడా టీడీపీ సింగిల్‌ గానే ప్లాన్‌ చేసుకోవ‌డాన్ని బీజేపీ నేత‌లు త‌ప్పుప‌డుతున్నారు.

మ‌రోవైపు టీడీపీ సైతం బీజేపీని స‌మర్థించ‌డం లేదు. మిత్రప‌క్షమైన టీడీపీని ప‌క్కనపెట్టి అధికార పార్టీని బీజేపీ నేత‌లు పొగ‌డ్తల‌తో ముంచెత్తుతున్నార‌ని అంటున్నారు. తాజాగా తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌ కు నంబ‌ర్ వ‌న్ ర్యాంకు క‌ట్టబెట్టడం, అటు కేంద్రమంత్రులు సైతం కేసిఆర్ పాల‌న‌ను తెగ‌ పోగిడేస్తుండం సైతం తాము గ‌మ‌నిస్తున్న‌ట్లు టీడీపీ నేత‌లు అంటున్నారు. బీజేపీ అంత‌ర్గ‌తంగా చేసేది అలా ఉంచి రేవంత్ రెడ్డి విష‌యాన్నే ప్ర‌స్తావించ‌డం ఉద్దేశ‌పూర్వ‌క‌మ‌ని వ్యాఖ్యానిస్తున్నారు.