Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో చేరాక జోరు తగ్గిందా?

By:  Tupaki Desk   |   7 Jan 2018 11:18 AM GMT
కాంగ్రెస్ లో చేరాక జోరు  తగ్గిందా?
X
తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలమూ ఆయన తనను అడిగే నాధుడు, అడ్డుకునే వీరుడు లేరన్నట్టుగా ఎడాపెడా చెలరేగిపోయారు. అంత దూకుడు ప్రదర్శిస్తూనే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తెలుగుదేశం పార్టీ వేదికగా సాధ్యం కాదని, ఇక్కడ సరిగా పోరాటం చేయలేకపోతున్నానని ప్రకటించి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన తీరును గమనిస్తే.. పాత రోజుల కంటె జోరు తగ్గినట్టే ఉన్నదని పలువురు భావిస్తున్నారు. పాపం.. రేవంత్ రెడ్డికి .. కాంగ్రెస్ లో మంచి రోజులు ఇంకా ప్రారంభం కాలేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి..కాంగ్రెస్ లోకి వెళ్లిన రేవంత్ రెడ్డికి అక్కడ ఎలాంటి ప్రామిసెస్ లభించాయో మనకు తెలియదు. రాహుల్ వద్ద ఎలాంటి బేరం మాట్లాడుకుని రేవంత్ ఆ గూటికి చేరారో తెలియదు. ఖచ్చితంగా రాష్ట్రస్థాయి పదవి కట్టబెడతారని మాత్రం అంతా అనుకున్నారు. ఏకంగా పీసీసీనే ఆయన చేతిలో పెడతారని కూడా కొందరు ఊహాగానాలు చేశారు. పైగా.. రేవంత్ చేరిక తర్వాత.. ఆయనను లీడర్ గా ప్రొజెక్ట్ చేయడానికి రాహుల్ వచ్చి బహిరంగ సభలో పాల్గొంటారనే ప్రచారమూ జరిగింది. కానీ అవన్నీ తేలిపోయాయి. పార్టీలో చేరాక కొన్నాళ్లు మౌనంగా ఉన్న రేవంత్ రెడ్డి.. డిసెంబరు 9 నుంచి అదికారికంగా పార్టీ కార్యాలయానికి రావడం మొదలెట్టాక ఇప్పటిదాకా మునుపటి దూకుడును ప్రదర్శించిన సందర్భాలు తక్కువేనని చెప్పాలి. కేసీఆర్ ను తిట్టడంలో కూడా ఒక హద్దు దాటవద్దని ఆయనకు పార్టీ సూచించిందా.. ఆయన జోరుకు బ్రేకులు వేసిందా అనే అంచనాలు కూడా సాగుతున్నాయి.

కాంగ్రెస్ తరఫున కేసీఆర్ మీద వీరస్థాయిలో విరుచుకుపడడం తగ్గింది. అసలు రేవంత్ మీడియా ముందుకు రావడమూ పలచబడింది. ఇటీవలి కాలంలో కేసీఆర్ నిరంతర విద్యుత్తును కీర్తించిన పవన్ కల్యాణ్ కు సుద్దులు చెప్పడానికి మినహా రేవంత్ కనిపించలేదు. తాజాగా తన పరిధిని తగ్గించుకుంటూ తన జిల్లా రాజకీయాలకు పరిమితమై మంత్రి లక్ష్మారెడ్డి డాక్టర్ చదువు నిజమేనా కాదా? అనే సందేహాలు లేవనెత్తుతున్నారు. ఆయన నిజంగా డాక్టరు చదివి ఉంటే ఆ సర్టిఫికెట్లు చూపించాలని అంటున్నారు.

రోడ్డు మీద నిల్చుని రేవంత్ అడిగితే లక్ష్మారెడ్డి ఎందుకు చూపించాలి. అయినా.. ఇలాంటి సందేహాలు ఉన్నప్పుడు కోర్టులో దావా వేస్తే గనుక.. కోర్టు వద్ద తేలిపోతుంది కదా.. అనేది కోర్టులకు వెళ్లడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రేవంత్ కు తెలియని సంగతి కాదు. ఏదో లక్ష్మారెడ్డి మీద బురద చల్లడానికి తప్ప నిర్మాణాత్మక విమర్శలు లేని ధోరణికి కాంగ్రెసులో జోరు తగ్గిన రేవంత్ పడిపోయినట్టుగా కనిపిస్తోంది.