Begin typing your search above and press return to search.

బాబుకు రేవంత్ ఇచ్చిన లాస్ట్ పంచ్ ఇదేనా?

By:  Tupaki Desk   |   29 Oct 2017 5:44 AM GMT
బాబుకు రేవంత్ ఇచ్చిన లాస్ట్ పంచ్ ఇదేనా?
X
తెలంగాణ టీడీపీలో ఓ వెలుగు వెలిగి..త‌న పొలిటిక‌ల్ ఎజెండాలో భాగంగా త‌న‌కు ఎంతో చేసిన పార్టీకి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గుడ్ బై చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో స‌మావేశం అయిన‌ట్లు వార్త‌లు రావ‌డంతో షాక్‌ ల ప‌రంప‌ర షురూ చేసిన రేవంత్‌....అధినేత చంద్రబాబుతో భేటీ సంద‌ర్భంగానే `ముంద‌స్తుగానే సిద్ధం చేసుకున్న మూడు పేజీల రాజీనామా లేఖ‌` ఇచ్చి చివ‌రి ట్విస్ట్ ఇచ్చేశారు. అయితే ఈ చివ‌రి ఎపిసోడ్‌ లో కూడా చంద్ర‌బాబుకు రేవంత్ మ‌స్కా కొట్టాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ నేప‌థ్యంలో... తెలుగుదేశం పార్టీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారన్న ఊహగానాలు కొద్దిరోజులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇంత త్వరగా ఉండకపోవచ్చని, రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చేందుకు సమయం ఇచ్చినప్పుడే, రేవంత్ చేరుతారని చాలా మంది భావించారు. అయితే రేవంత్ రెడ్డి తెలివిగా వ్యవహారించారని అంటున్నారు. తనపై పార్టీ క్రమశిక్షణా చర్య తీసుకోక ముందే రాజీనామా చేసి బయట పడ్డారని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ తో దోస్తీ విష‌యం బ‌య‌ట‌ప‌డిన నేప‌థ్యంలో...ఆలస్యం చేస్తే పార్టీ క్రమశిక్షణా చర్య తీసుకోవడమో లేక పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నచ్చజెప్పడమో ఏదో ఒకటి జరుగుతుందని రేవంత్ ఊహించారు. చంద్రబాబు రేవంత్‌ ను కూర్చోబెట్టుకుని నచ్చజెబితే, మళ్లీ ఇరకాటంలో పడాల్సి వస్తుందని ఆయన భావించారు...అందుకే ఆ అవకాశం ఇవ్వకుండా రాజీనామా చేశారు.

త‌న విదేశీ ప‌ర్య‌ట‌న గురించి అమరావతిలో విలేఖరుల సమావేశం నిర్వహించిన తర్వాత మళ్లీ మాట్లాడుదామని చంద్రబాబు చెప్పినా, రేవంత్ వినిపించుకోలేదు. ఈ విలేక‌రుల‌ సమావేశం స‌మ‌యంలో జ‌రిగే అనూహ్య ప‌రిణామాల‌ను రేవంత్ ఊహించార‌ని అంటున్నారు. ఈ ప్రెస్‌ మీట్లో చంద్రబాబు తన పక్కనే రేవంత్‌ ను కూర్చోబెట్టుకుని, రేవంత్ పార్టీ వీడడం లేదని, ఇప్పటి వరకు మీడియాలో వచ్చిన వార్తలన్నీ కట్టు కథలేనని చంద్రబాబు ఖచ్చితంగా చెప్పి ఉండే వారు. అప్పుడు చంద్రబాబు పక్కనే ఉన్న రేవంత్‌ కు మైక్ తీసుకుని ఖండించేందుకూ అవకాశం ఉండేది కాదు. ఇటువంటి పరిణామాలు ఎదురవుతాయని భావించిన రేవంత్ చాలా ఉపాయంగా, తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయం కార్యదర్శికి అందజేసి నేరుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి బయలుదేరారని...ఆ విధంగా త‌న లాస్ట్ పంచ్‌ ను బాబుకు ఇచ్చార‌ని అంటున్నారు.