Begin typing your search above and press return to search.

తెలంగాణను బిహారీలు కబ్జా చేస్తున్నారా? సంచలనంగా రేవంత్ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   1 March 2022 5:30 AM GMT
తెలంగాణను బిహారీలు కబ్జా చేస్తున్నారా? సంచలనంగా రేవంత్ వ్యాఖ్యలు
X
మాటలు తూటాల మాదిరి పేలుతున్నాయి. అనుకుంటాం కానీ.. తూటాలే కాదు.. మాటల తూటాలు కూడా డ్యామేజ్ చేస్తుంటాయి. ఆ మాటకు వస్తే.. తూటా పేలినంతనే కేసు అవుతుంది. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కానీ.. క్రమపద్దతిలో పేలే మాటల తూటాలతో పోలీసు కేసు చిక్కులు లేకపోగా.. అంతో ఇంతో దాన్ని టార్గెట్ చేసిన వారికి డ్యామేజ్ చేసేలా చేస్తుంది. మాటల తూటాలకు ఉన్న ప్రయోజనం ఏమంటే.. దాన్ని ఉపయోగించే వారు చెప్పే మాటల్లో కాస్తంత గుజ్జు ఉండటం. విన్నంతనే.. నిజమేగా? అన్న భావన మనసుకు కలగటం. అలాంటి ఫీలింగ్ కలిగినంతనే జరిగే నష్టం అంతా ఇంతా కాదు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి చెలరేగిపోతున్నారు. ఘాటు విమర్శలు మాత్రమే కాదు.. ఆరోపణలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇమేజ్ కు డ్యామేజ్ జరిగేలా ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. బిహార్ ముఠా తెలంగాణను ఆక్రమిస్తోందని.. ఇతర రాష్ట్రాల ఐఏఎస్.. ఐపీఎస్ లకు తెలంగాణలో ప్రాధాన్యతను ఇస్తున్నారని.. అదే సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారులకు మాత్రం ఏ మాత్రం ప్రాధాన్యత లేని పోస్టుల్ని అప్పజెబుతున్నట్లుగా మండిపడ్డారు.

రేవంత్ వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? ఆయన చెప్పిన మాటల్ని వినాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నను వేసుకుంటే.. వచ్చే సమాధానానికి ముందే.. రేవంత్ వివరణ ఇచ్చేస్తున్నారు. అదేమంటే.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్.. ప్రస్తుతం డీజీపీగా బాధ్యతల్ని నిర్వహిస్తున్న అంజనీ కుమార్.. అరు శాఖలు ఉన్న మునిసిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్.. ఎనిమిది శాఖల్ని చూసే సందీప్ కుమార్ సుల్తానియాలు బిహార్ నుంచి వచ్చారు. వీరు సరిపోనట్లుగా సీఎం కేసీఆర్ కు సలహాలు ఇచ్చేందుకు కొత్తగా ప్రశాంత్ కిశోర్ అనే వ్యక్తిని బిహార్ నుంచి తీసుకొచ్చారన్నారు.

ఈ సందర్భంగా మరో ఆసక్తికర అంశాన్ని ఆయన వెల్లడించారు. గతంలో ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ తాత ముత్తాతలు బిహార్ నుంచి వచ్చారని.. తమ పూర్వీకులది బిహార్ అని కేసీఆరే చెప్పారన్నారు. అద్భుతమైన ఆలోచనలతో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రిగా తనను తాను గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. ప్రశాంత్ కిశోర్ ను ఎందుకు తెచ్చుకున్నారు? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కింద గులాంగిరి చేయలేని తెలంగాణకు చెందిన పాలమూరు బిడ్డ ప్రవీణ్ కుమార్.. ప్రస్తుత డీజీపీ (సెలవులో ఉన్నారు) మహేందర్ రెడ్డిలు తెలంగాణ బిడ్డలే అన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బయటకు రావాలన్నారు. మొత్తంగా తన మాటల తూటాలతో సీఎం కేసీఆర్ కు డ్యామేజ్ చేసేలా మాట్లాడటంలో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త పుంతలు తొక్కుతున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి.. రేవంత్ వ్యాఖ్యలకు కేసీఆర్ అండ్ కో ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.