Begin typing your search above and press return to search.

24 గంట‌ల్లో.. బ్యాలెన్స్ చేసిన రేవంత్!

By:  Tupaki Desk   |   13 July 2021 4:30 PM GMT
24 గంట‌ల్లో.. బ్యాలెన్స్ చేసిన రేవంత్!
X
నాయ‌కుడికి, కార్య‌క‌ర్త‌కు మ‌ధ్య చిన్న గీత‌ ఉంటుంది. ఇద్ద‌రూ ప‌నిచేసేది పార్టీ కోస‌మే.. ఇద్ద‌రూ శ్రమించేది న‌మ్మిన సిద్ధాంతం కోస‌మే. కానీ.. ఒక‌రు పైన ఉంటారు. ఒక‌రు కింద ఉంటారు. ఒక‌రు ఆదేశిస్తారు. మ‌రొక‌రు శిర‌సావహిస్తారు. మ‌రి.. ఆదేశించే వ్య‌క్తికి కావాల్సిన అర్హ‌త ఏంటీ.. అన్న‌ప్పుడు మొట్ట మొద‌ట‌గా ఎదుర‌య్యే స‌మాధానం స‌మ‌న్వ‌యం. అవును.. నాయ‌కుడు అనేవాడు స‌మ‌న్వ‌యం చేయాలి. పార్టీలోని ప్ర‌తి ఒక్క‌రికీ ఒక్కో విధ‌మైన అభిప్రాయం ఉంటుంది. ఒకే అంశం మీద భిన్న‌మైన భావాలు ఉంటాయి. వారంద‌రినీ స‌మ‌న్వ‌యం చేస్తూ.. పార్టీ అనుకున్న ల‌క్ష్యం దిశ‌గా న‌డిపించాల్సి ఉంటుంది. నాయ‌కుడి ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం ఇదే. అంతిమ బాధ్య‌త కూడా ఇదే.

ఈ బాధ్య‌త‌ను తాను ప‌ర్ఫెక్ట్ నిర్వ‌హిస్తాన‌ని మొద‌టి టాస్క్ లోనే చేసి చూపించారు తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి. రేవంత్ కు పీసీసీ చీఫ్ రాకుండా సీనియ‌ర్లు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేశారో అంద‌రికీ తెలిసిందే. కానీ.. పార్టీయే ముఖ్య‌మని భావించిన అధిష్టానం.. అన్ని విష‌యాల‌నూ మ‌దించి, ఫైన‌ల్ గా రేవంత్ కే ప‌ట్టాభిషేకం చేసింది. అయితే.. దీన్ని నిర‌సిస్తూ నేత‌లు గ‌ట్టిగానే ఎదురు తిరుగుతార‌ని భావించారు అంద‌రూ. అయితే.. రేవంత్ మాత్రం త‌న‌దైన రాజ‌కీయం మొద‌లు పెట్టాడు. వ‌రుస‌గా సీనియ‌ర్లంద‌రినీ క‌లిసి వారి అహం చ‌ల్లార్చే ప్ర‌య‌త్నం చేశారు.

అనంత‌రం.. కొత్త పీసీసీ క‌మిటీ స‌మావేశంలో మాట్లాడిన రేవంత్‌.. అంద‌రినీ క‌లుపుకుపోయే ప్ర‌య‌త్నం చేశారు. తాను అంద‌రిక‌న్నా చిన్న‌వాడిన‌ని చెప్పుకున్నారు. పెద్ద‌ల స‌ల‌హాలు తీసుకొని, అంద‌రినీ క‌లుపుకుపోతాన‌ని చెప్పుకొచ్చారు. ఎలాంటి భేష‌జాలూ లేకుండా ప‌నిచేస్తాన‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో.. తానే ఫైన‌ల్ అనే విష‌యాన్ని కూడా ఇండైరెక్ట్ గా చెప్పారు. తాను ఇప్పుడు ప్యాసింజ‌ర్ ట్రైన్ కు డ్రైవ‌ర్ ను అని చెప్పారు రేవంత్‌. ఇలా.. త‌న‌దైన స‌మ‌న్వ‌యంతో కుదురుకుంటున్న స‌మ‌యంలోనే.. హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి పేల్చిన బాంబ్ రాష్ట్ర కాంగ్రెస్ లో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. కాంగ్రెస్ లో ఉండి టీఆర్ఎస్ నేత‌ల‌తో ట‌చ్ లో ఉన్న‌ట్టు ఆడియో లీకులు కావ‌డంతో.. పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌.. రేవంత్ రెడ్డిపైనా ఆరోప‌ణ‌లు చేశారు. రూ.50 ల‌క్ష‌లు ఇచ్చి పీసీసీ ప‌ద‌విని కొనుక్కున్నార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

దీంతో.. తెలంగాణ కాంగ్రెస్ లో ర‌చ్చ మొద‌ల‌వుతుంద‌నే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మైంది. ఇప్ప‌టికే కోమ‌టిరెడ్డి ఏదో విధంగా త‌న నిర‌స‌న స్వ‌రం వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కౌశిక్ రెడ్డి పార్టీని వీడ‌డం.. ఆరోప‌ణ‌లు చేయ‌డంతో కేడ‌ర్ అయోమ‌యానికి గురైంది. పార్టీలో ఉన్న బ్లాక్ షీప్స్ ప‌నిప‌డ‌తామ‌ని రేవంత్ హెచ్చ‌రించ‌డం వంటి ప‌రిణామాల‌తో కాంగ్రెస్ లో ఒక‌విధ‌మైన అల‌జ‌డి ఏర్ప‌డింది. అయితే.. దీన్ని కేవ‌లం 24 గంట‌ల్లోనే సెట్ చేశాడు రేవంత్‌.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన‌ మాజీ ఎంపీ, సీనియ‌ర్ నేత కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారు. ఈ మేర‌కు రేవంత్ మాట్లాడ‌డం.. విశ్వేశ్వ‌ర్ రెడ్డి సానుకూలంగా స్పందించ‌డం అన్నీ జ‌రిగిపోయాయి. రేవంత్ కు పీసీసీ చీఫ్ రావ‌డం ఆనందంగా ఉంద‌న్న విశ్వేశ్వ‌ర్ రెడ్డి.. కాంగ్రెస్ లో త్వ‌ర‌లోనే చురుతాన‌ని చెప్పారు. రేవంత్ కు వ్య‌క్తిగ‌తంగా చూసుకున్న‌ప్పుడు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప‌రంగా చూసుకున్న‌ప్పుడు ఇది పెద్ద విష‌య‌మే.

కౌశిక్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ లో అల‌జ‌డి పెరిగి పెద్ద‌ద‌వుతుంద‌ని, త‌ద్వారా రేవంత్ ప్ర‌భ మ‌స‌క‌బారుతుంద‌ని చాలా మంది భావించారు. కానీ.. త‌న‌దైన రాజ‌కీయంతో విశ్వేశ్వ‌ర్ రెడ్డి టాపిక్ ను చ‌ర్చ‌లోకి తెచ్చి, రేవంత్ లెవ‌ల్ చేసేశాడు. త‌ద్వారా.. తాను పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి స‌రైన వాడినే అని నిరూపించుకున్నారు. ఇక‌, మున్ముందు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాడు అన్న‌ది ఆసక్తిక‌రం.