Begin typing your search above and press return to search.

కుటుంబ పాల‌న‌కు కొత్త అర్థం చెప్పిన రేవంత్‌

By:  Tupaki Desk   |   1 Nov 2017 5:38 AM GMT
కుటుంబ పాల‌న‌కు కొత్త అర్థం చెప్పిన రేవంత్‌
X
మాట‌లు నేర్చిన చిలుక ఏమైనా చెబుతుంద‌ని ఊరికే అన‌లేదేమో. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ఎంత ముచ్చ‌ట‌గా మాట‌లు చెబుతారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాదిరి తిమ్మిని బ‌మ్మిని చేసేలా మాట్లాడ‌టంలో దిట్ట‌. ఓవైపు గ‌ణాంకాలు చెబుతూనే మ‌రోవైపు పిట్ట‌క‌థ‌లు వినిపిస్తూ.. నోటికి వ‌చ్చిన‌ట్లు తిట్ల పురాణం అందుకోవం రేవంత్ స్టైల్‌.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నియంత పాల‌న‌ను దించేయ‌టం కోసం తాను పార్టీ మారిన‌ట్లు చెప్పుకున్న ప‌సుపుప‌చ్చ ర‌క్త‌మున్న రేవంత్ (అన్య‌దా భావించొద్దు. ఆ మాట‌ల్ని రేవంతే స్వ‌యంగా చెప్పారు సుమండి) కుటుంబ పాల‌న అనే విష‌యానికి కొత్త అర్థాన్ని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ పాల‌న‌ను కుటుంబ పాల‌న‌గా త‌ర‌చూ రేవంత్ దుయ్య‌బ‌డుతుంటారు. కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చిన త‌ర్వాత కుటుంబ పాల‌న‌.. వార‌స‌త్వ రాజ‌కీయాల్లాంటివి మాట్లాడితే పార్టీ లైన్‌ కి వ్య‌తిరేకంగా మాట్లాడిన‌ట్లు.. అధినాయ‌క‌త్వాన్ని వేలెత్తి చూపించిన‌ట్లు. అందుకేనేమో.. పార్టీ మారిన త‌న తొలి మీడియా స‌మావేశంలోనే.. కుటుంబ పాల‌న అంటే ఏమిటో క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం అవ‌స‌రానికి ఒక‌లా మాట్లాడ‌టం నేత‌ల‌కు అల‌వాటే. అందుకు రేవంత్ ఏమీ మిన‌హాయింపు కాదు. కుటుంబ పాల‌న అంటే.. కుటుంబం కోసం.. కుటుంబ స‌భ్యుల ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌ని చేయ‌టాన్ని కుటుంబ పాల‌న అంటార‌ని.. గాంధీ ప్యామిలీకి వ‌ర్తించ‌ద‌న్నారు. ఎందుక‌లా అంటే.. గాంధీ ఫ్యామిలీ ప‌వ‌ర్ కోసం పాకులాడ‌లేద‌ని.. క‌రివేపాకు మాద‌రి ప‌ద‌వుల్ని వ‌దిలేశార‌ని.. మంచి పాల‌న అందించాల‌న్న ఉద్దేశంతో స‌మ‌ర్థులైన నాయ‌కుల్ని కుర్చీలో కూర్చోబెట్టి పాల‌న చేయించార‌న్న విష‌యాన్ని చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి నొప్పి లేకుండా మాట‌ల్ని తిప్పి మాట్లాడ‌టం రేవంత్‌ కు అల‌వాటే. త‌న‌కున్న టాలెంట్‌ ను కాంగ్రెస్ లో చేరిన త‌ర్వాత నిర్వ‌హించిన తొలి మీడియా స‌మావేశం లోనే ఫైర్ బ్రాండ్ స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి.