Begin typing your search above and press return to search.

రేవంత్ ఇప్పుడు ఏం చేయ‌నున్నారంటే...

By:  Tupaki Desk   |   28 Oct 2017 9:59 AM GMT
రేవంత్ ఇప్పుడు ఏం చేయ‌నున్నారంటే...
X
దాదాపుగా గ‌త 20 తెలంగాణ టీడీపీలో నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. టీటీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. అమ‌రావ‌తిలో రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి అందజేశారు. అనంత‌రం ఆయ‌న త‌న‌ను క‌లిసిన కొంద‌రు మీడియాతో ప్ర‌తినిధుల‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.పార్టీపై, పార్టీ అధ్యక్షుడిపై త‌నకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. తాను ఎల్లప్పుడూ పార్టీ, కార్యకర్తల శ్రేయస్సు కోరుకునే వ్యక్తినని చెప్పుకొచ్చారు. త‌న‌ను తక్కువ సమయంలో ఉన్నత పదవులను నిర్వహించేలా పార్టీ చేసిందని రేవంత్ తెలిపారు.త‌న‌ ఎదుగుదలకు చంద్ర‌బాబు ఎంతో కృషి చేశారని...చంద్రబాబు త‌నకు తండ్రితో సమానమ‌ని రేవంత్ అన్నారు.

అయితే...గత కొంత కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు త‌న‌ను తీవ్రంగా భాదించాయని రేవంత్ వాపోయారు. ఏపీకి చెందిన‌, టీటీడీపీ సీనియర్ లు తమ స్వార్థం కోసం ఇతర పార్టీల నేతలతో చేతులు కలిపి టీటీడీపీని నాశనం చేస్తున్నారని రేవంత్ మండిప‌డ్డారు. తాను కేసీఆర్ పై పోరాటం చేస్తుంటే ఏపీ, టీటీడీపీకీ చెందిన నేతలు ఆయనతో కలిసి సమావేశం నిర్వహించారని...మరికొంతమంది టీఆరెస్ ప్రభుత్వంతో లాలూచీపడి కాంట్రాక్టులు తెచ్చుకున్నారని రేవంత్ ఆరోపించారు. అలాంటప్పుడు త‌న పోరాటానికి విలువ ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్య‌క్తం చేశారు. ``నన్ను ఇబ్బందులకు గురిచేయడం కోసం, నన్ను దెబ్బకొట్టడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ టీడీపీ నేతలకు తాయిలాలు ఇస్తున్నారు. కేసీఆర్ నియంత పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిపించాలి. నా పోరాటం ఎప్పుడు కేసీఆర్ - టీఆర్ ఎస్‌ పైనే`` అని స్ప‌ష్టం చేశారు.

తాను పార్టీ సంక్షేమం కోరుకునే వ్యక్తిన‌ని, త‌న‌ స్వార్థం కోసం ఎప్పుడు పార్టీని అడ్డుపెట్టుకోలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ``టీడీఎల్పీ నేతగా ఉన్నా నా కన్నా సీనియర్ అయిన సండ్రకు అన్ని బాధ్యతలు అప్పగిస్తూ స్పీకర్ కు గతంలో లేఖ రాశాను. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు కూడా ఎక్కువ సమయం పార్టీలోని మా ఎమ్మెల్యేలకు ఇచ్చా. కానీ ప్ర‌స్తుతం పార్టీ క్యాడర్ ను చూస్తే చాలా బాధగా ఉంది. తెలంగాణలో టీడీపీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి, కార్యకర్తలు చంద్ర‌బాబే కారణం. టీడీపీ క్యాడర్ నాకు ప్రాణ సమానం. కొడంగల్ లో కార్యకర్తలతో చర్చించాకే ఏదైనా నిర్ణయం`` అని రేవంత్ రెడ్డి తెలిపారు.

మ‌రోవైపు రోడ్డు మార్గంలో రేవంత్ రెడ్డి విజయవాడ నుండి హైదరాబాద్ కు బయలుదేరారు. రేవంత్ రెడ్డి మరో రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంద‌ని స‌మాచారం. త్వరలో కాంగ్రెస్ లో చేరే తేదీ ప్రకటించే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. విజయవాడ నుండి హైదరాబాద్ కు బయలుదేరిన రేవంత్ రెడ్డి...హైదరాబాద్ లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.