Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లో రేవంత్ ఓడిపోయాడోచ్‌..

By:  Tupaki Desk   |   24 Sep 2019 12:33 PM GMT
కాంగ్రెస్‌ లో రేవంత్ ఓడిపోయాడోచ్‌..
X
తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా హుజూర్‌ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పీసీసీ అధ్యక్షుడు - న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి రెడ్డిని నిర్ణ‌యిస్తూ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఉత్త‌మ్‌ కుమార్‌ రెడ్డి త‌న స‌తీమ‌ణికి కాంగ్రెస్ టికెట్ కెటాయించి పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ - మ‌ల్కాజ్‌ గిరి ఎంపి రేవంత్‌ రెడ్డికి సోనియా గాంధీ షాక్ ఇచ్చార‌నే చెప్ప‌వచ్చు. రేవంత్‌ రెడ్డి త‌న అనుచ‌రుడు అయిన చామ‌ల కిర‌ణ్‌ రెడ్డికి టికెట్ ఇవ్వాల‌ని ఏఐసీసీకి నివేదించుకున్నా సోనియాగాంధీ క‌నిక‌రం చూప‌లేదు. దీంతో పీసీసీలో ఉత్త‌మ్ మాట‌కు తిరుగులేద‌ని తేలిపోయింది.

హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి రెడ్డి పేరు ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. గ‌త‌ 2014 ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ గెలుపొందలేదు. కోదాడ నుంచి టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌ గెలుపొందారు. 2018 ఎన్నికల్లో హుజూర్‌ నగర్‌ నుంచి గెలుపొందిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి 2019 లోక్‌ సభ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గానికి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో.. అక్టోబర్‌ 21న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ అక్టోబ‌ర్ 24న జ‌ర‌గ‌నుంది.

ఇక టీఆర్‌ ఎస్‌ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డిని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. సైదిరెడ్డికి సీఎం కేసీఆర్‌ బీ ఫారం కూడా అందజేశారు. ఆయ‌న గ‌త ఎన్నిక‌లకు ముందు ఎన్నారైగా ఉంటూ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డిపై టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి చివ‌రి వ‌ర‌కు గ‌ట్టి పోటీ ఇచ్చి 7 వేల ఓట్ల‌తో ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్య‌ర్థి ఖ‌రారు కావ‌డంతో పోరు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్న‌ది. ఇప్ప‌టికే ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి ఇలాఖాగా ఉన్న హుజూర్‌ న‌గ‌ర్ ఎన్నిక‌లో కాంగ్రెస్ నుంచి అధికార పార్టీకి గ‌ట్టి పోటీ త‌ప్ప‌ద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఉత్త‌మ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్ అభ్య‌ర్థికి 30వేల మెజారిటీ ఖాయ‌మ‌ని ప్ర‌క‌టించాడు. దీంతో టీఆర్ ఎస్ ఈ ఎన్నిక‌ను ఎలాగైనా గెలిచి స‌త్త చాటాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఉత్త‌మ్ సొంత కోట‌లో గులాబీ జెండా ఎగ‌ర‌వేసేందుకే టీఆర్ ఎస్ ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసేసింది. మ‌ధ్య‌లో బీజేపీ సైతం గ‌ణ‌నీయంగా ఓట్లు సాధించేందుకు రెడీ అవుతోంది. ఏదేమైనా హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక అటు ఉత్త‌మ్ కుమార్‌ రెడ్డికి - కేసీఆర్‌ కు స‌వాల్ లాంటిదే.