Begin typing your search above and press return to search.

కమలానికి కొత్త కన్ఫ్యూజన్ పెట్టిన రేవంత్

By:  Tupaki Desk   |   12 July 2022 3:29 AM GMT
కమలానికి కొత్త కన్ఫ్యూజన్ పెట్టిన రేవంత్
X
ఎప్పుడూ ఒకేలా ఉంటే అవి రాజకీయాలు ఎందుకు అవుతాయి. ఊహించని మలుపులకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే పాలిటిక్స్ లో ఎప్పుడేం జరుగుతుందో ఒక పట్టాన అర్థం కాదన్న విషయం తెలిసిందే. సమయానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం రాజకీయ నేతలకు అలవాటు. అందుకు తగ్గట్లే వారి ఎత్తుగడలు ఉంటాయి.

ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్ని చూసినప్పుడు ఒక విషయం ఇట్టే అర్థమవుతుంది. ఒక పార్టీ మరో పార్టీ మీద చేసే వ్యాఖ్యలు.. ఆ పార్టీ మరో పార్టీ మీద చేసే కామెంట్లను చూసినప్పుడు.. కొత్త సందేహాలకు గురి చేసేలా.. కన్ఫ్యూజన్ కేరాఫ్ అడ్రస్ అన్నట్లు వారి వ్యాఖ్యలు ఉండటం కనిపిస్తుంటుంది.

గత వారంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తాను సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి బరిలోకి దిగుతానని.. సీఎం కేసీఆర్ ను ఓడించటమే తన లక్ష్యమని చెప్పారు.

దీనికి సంబంధించిన సవాల్ ను ఆయన విసిరారు. ఈ సందర్భంగా పశ్చిమబెంగాల్ లో దీదీకి అత్యంత విధేయుడిగా ఉండి.. తర్వాతి కాలంలో బీజేపీకి వెళ్లిన సువేందు.. గత ఎన్నికల్లో మమతబెనర్జీని ఓడించిన సంగతి తెలిసిందే. గజ్వేల్ లో అలాంటి ఫలితమే కేసీఆర్ కు ఎదురవుతుందని ఈటల వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదంతా బాగానే ఉందనుకున్న వేళ.. అనూహ్యంగా ఈ ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించేది కాంగ్రెస్ అభ్యర్థేనని పేర్కొన్నారు. ఆ విషయంలో మరెలాంటి సందేహం లేదన్న ఆయన మాటలకు అడ్డు తగులుతూ ఈటల ప్రస్తావన తెచ్చారు మీడియాప్రతినిధులు.

ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేస్తారని చెప్పారు కదా? మీ అభ్యర్థి ఎలా గెలుస్తారన్న ప్రశ్నకు రేవంత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 'గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించేది కాంగ్రెస్ అభ్యర్థే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈటల గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని చెప్పారే తప్పించి ఏ పార్టీ నుంచో చెప్పలేదు కదా?' అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్ ప్రైజింగ్ గా మారాయని చెప్పక తప్పదు. మరి.. ఈ వ్యాఖ్యలపై ఈటల ఎలా రియాక్టు అవుతారో చూడాలి.