Begin typing your search above and press return to search.

రేవంత్ తట్టాబుట్టా సర్దేయటంలో కేటీఆర్ ఫెయిల్

By:  Tupaki Desk   |   6 Feb 2016 6:08 AM GMT
రేవంత్ తట్టాబుట్టా సర్దేయటంలో కేటీఆర్ ఫెయిల్
X
కొన్ని మాటలు ఆచితూచి అనాల్సి ఉంటుంది. ఏమో.. గుర్రం ఎగరావచ్చు అన్న చందంగా ఎప్పుడైనా ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. గ్రేటర్ ఎన్నికల సమయంలో.. టీఆర్ఎస్ నాయకులు సైతం తమకు 90 సీట్లు వస్తాయని కలలో కూడా అనుకున్నది లేదు. గ్రేటర్ పోలింగ్ ముగిసిన తర్వాత.. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటే.. గ్రేటర్ లో తమకు 75 సీట్లు వస్తాయని మాత్రమే మంత్రి కేటీఆర్ చెప్పటం మర్చిపోకూడదు. వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలో టీఆర్ ఎస్ 80 నుంచి 90 స్థానాలు సాధిస్తాయని అంచనా కట్టాయి.

సహజంగా మీడియా సంస్థలు చెప్పే అంచనాల కంటే రాజకీయ పార్టీల అంచనాలు ఎక్కువగా ఉంటాయి. కానీ.. అందుకు భిన్నమైన సీన్ గ్రేటర్ ఎన్నికల్లో కనిపించింది. టీఆర్ ఎస్ విజయఢంకా మోగిస్తుందని మీడియా సంస్థలు అంచనాలు వేస్తే.. టీఆర్ ఎస్ పార్టీ నేతలు మాత్రం ఆచితూచి అంచనాలు వేశారే కానీ గాలిని మూటలు కట్టేలా లెక్కలు వేయలేదు.

ఇదే వారికిప్పుడు అంతులేని ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాలి. అయితే.. ఈ ఆనందంలో మరో చిత్రమైన లోటు కనిపిస్తుంది. తమ పార్టీ అంతు చూస్తామని తొడగొట్టి సవాలు విసిరిన టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని దారుణంగా దెబ్బ తీసే అవకాశం జస్ట్ మిస్ కావటంపై టీఆర్ ఎస్ నేతలు కాస్త నిరాశగా ఉన్నారు. టీఆర్ ఎస్ కానీ 100 సీట్లు తెచ్చుకోగలిగితే.. తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. రాజకీయ సన్యాసం తీసుకొని.. తెలంగాణను వదిలి వెళ్లిపోతానని సవాలు విసరటం తెలిసిందే.

ఈ భీకర శపధానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ పెద్దగా రియాక్ట్ కాలేదు. వంద అన్న మాట ఆయన చెప్పేందుకు భయపడ్డారు. ఎందుకంటే.. వంద సీట్లు సాధించటం సామాన్య విషయం కాదు. అందుకే.. వంద మీద మాట్లాడని కేటీఆర్.. గ్రేటర్ కోట మీద గులాబీ జెండా ఎగరటం ఖాయమన్న మాటను పదే పదే ప్రస్తావించారు. కేటీఆర్ వెనకడుగు వేయటాన్ని గుర్తించిన రేవంత్.. తన శపధాన్ని పదే పదే ప్రస్తావించి కేటీఆర్ అండ్ కో డిఫెన్స్ లో పడేలా మాట్లాడారు.

అయితే.. తాజాగా విడుదలైన గ్రేటర్ ఫలితాలు చూస్తే అరేరె.. అనుకునే పరిస్థితి. కాస్త సాహసం చేసి.. రేవంత్ విసిరిన సవాలుకు కనుక రియాక్ట్ అయి ఉంటే ఎంత బాగుండేదన్న భావన పలువురిలో కలుగుతోంది. అదే సమయంలో రేవంత్ బ్యాచ్ కి అయితే.. దిమ్మ తిరిగిపోయిన పరిస్థితి. తాము రెచ్చగొడితే రెచ్చిపోయి.. ఢీ అంటే ఢీ అన్న మాట కానీ కేటీఆర్ బ్యాచ్ నోటి నుంచి వచ్చి ఉంటే ఈ రోజు రేవంత్ పరిస్థితి ఏమిటన్న విషయాన్ని ఆలోచించటానికి కూడా భయపడే పరిస్థితి.

గ్రేటర్ ఫలితం చెప్పేదేమంటే.. గతంలో మాదిరి తొందరపడి సవాళ్లు విసిరే విషయంలో విపక్షాలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్న విషయాన్ని తేల్చేసింది. ఇప్పటికైతే గులాబీకి తిరుగులేదని.. కారు స్పీడ్ కు బ్రేకులేసే సత్తా తెలంగాణలో ఎవరూ లేరన్న విషయం మరోసారి స్పష్టమైంది. ఆసక్తికరమైన ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించి ముగించాలి. గులాబీ బ్యాచ్ సాధించిన విజయాన్ని కాస్త తక్కువ చేసే ప్రయత్నంలో రేవంత్ సవాల్ ను తీసుకొచ్చిన పలువురు.. కేటీఆర్ ఫెయిల్ అయ్యారని చెప్పుకోవటం చూస్తే.. ఓటమిలోనూ గెలుపు చూసుకోవటం తమ్ముళ్లకే సాధ్యమన్న భావన కలగక మానదు.