Begin typing your search above and press return to search.

చుట్టం కోసం కేసీఆర్ చ‌ట్టం..5వేల ఎక‌రాలు స్వాహా

By:  Tupaki Desk   |   12 Feb 2018 1:33 PM GMT
చుట్టం కోసం కేసీఆర్ చ‌ట్టం..5వేల ఎక‌రాలు స్వాహా
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ద‌ఫా భూ స్కాంతో విరుచుకుప‌డ్డారు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 5వేల ఎక‌రాల భూమిని త‌న స‌న్నిహితుడికి అప్ప‌గించేందుకు సీఎం కేసీఆర్ స్కాంకు శ్రీ‌కారం చుట్టార‌ని ఆరోపించారు. గాంధీభ‌వ‌న్‌ లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి అసైన్‌ మెంట్ ల్యాండ్స్ పై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకే హడావిడిగా అసెంబ్లీని ప్రోరోగ్ చేశార‌ని ఆరోపించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగనంత అతిపెద్ద భూకుంభకోణం ముఖ్య‌మంత్రి కేసీఆర్ - మైహోం సంస్థ‌ల అధినేత జూపల్లి రామేశ్వ‌ర‌రావులు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారులకు మేలు చేస్తున్నామ‌నే ముసుగులో ఆర్డినెన్స్ తేవాలని చూస్తున్నార‌ని ఆరోపించారు. అసైన్‌ మెంట్ ఆర్డినెన్స్ వెనక కేసీఆర్ కుటుంబం వేల కోట్ల భూ దందా ఉందని రేవంత్ దుయ్య‌బ‌ట్టారు. నూత‌న స్కాంలో కేసీఆర్ బినామీ అయిన జూపల్లి రామేశ్వర్ రావ్ ఉన్నార‌ని రేవంత్ పేర్కొన్నారు. శంషాబాద్ - మహేశ్వరం పరిసరాల్లో నాలుగు వేల ఎకరాల భూమి జూపల్లి చేతిలో ఉన్నాయని - హెచ్ ఎండీఏ ప్రాంతంలో అసైన్ ల్యాండ్ రెగ్యులరైజ్ వ్యతిరేకించినందుకే బీఆర్ మీనాను బదిలీ చేశారని ఆరోపించారు. రామేశ్వర్ రావుకు మేలు చేసేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భూములను కట్టబెట్టారని దుయ్య‌బ‌ట్టారు. ఈ అక్రమ భూములను రెగ్యులరైజ్ చేసేందుకే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తుందన్నారు. శంషాబాద్ - మహేశ్వరం మండలంలో రామేశ్వర్ రావుకు ఉన్న భూములెన్ని వాటిలో అసైన్ లాండ్ ఎన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన చుట్టం జూపల్లి కోసం చట్టం తేవాలని చూస్తున్నార‌ని మండిప‌డ్డారు.

కేసీఆర్ ధన దాహం భూదాహం కోసమే ఈ ఆర్డినెన్స్ అని రేవంత్ ఆరోపించారు. సీఎం - సీఎం బంధువులపై నేను ఆరోపణలు చేస్తున్నాన‌ని దైర్యం ఉంటే త‌నపై కేసులు పెట్టుకోవ‌చ్చున‌ని స‌వాల్ విసిరారు. నయీమ్ ఎన్‌ కౌంటర్ వెనక, ఈ స్థ‌లానికి సంబందించిన చీకటి కోణం ఉందని రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ మొత్తం భూ దందా పై విచారణ జరిపించాలని కోరారు. కేసీఆర్‌ కు చిత్తశుద్ధి ఉంటే త‌న ఆరోపణలపై స్పందించాలని డిమాండ్ చేశారు.