Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లో రేవంత్ దుమారం

By:  Tupaki Desk   |   10 May 2018 9:45 AM GMT
కాంగ్రెస్‌ లో రేవంత్ దుమారం
X
కోరిక‌లు అంద‌రికి ఉంటాయి. కానీ.. మ‌న‌సులోని మాట‌ను చెప్పాల‌నుకున్న‌ప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. స‌మ‌యం.. సంద‌ర్భం చూసుకొని నోరు విప్పాలి. తాను చెప్పే మాట‌ల‌కు తానొక్క‌డే అండ‌గా ఉండ‌కూడ‌దు. మిగిలిన రంగాల వారి విష‌యం ఎలా ఉన్నా.. రాజ‌కీయాల్లో ఉన్న వారు అస్స‌లు అలా చేయ‌కూడ‌దు. కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చిన రేవంత్ తాజాగా బ‌య‌ట‌పెట్టిన త‌న సీఎం క‌ల మాట ఆ పార్టీలో ఇప్పుడు పెను దుమారాన్నే రేపుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ అన్నంత‌నే చాంతాడంత పొడువుగా పెద్ద పెద్ద నేత‌ల పేర్లు వ‌రుస‌గా వినిపిస్తుంటాయి. జైపాల్ రెడ్డి.. జానారెడ్డి.. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌.. డీకే అరుణ‌.. శ్రీ‌ధ‌ర్ బాబు ఇలా చాలానే పేర్లు వినిపిస్తాయి. వీరంతా తెలంగాణ రాష్ట్రంలో సీఎం ప‌ద‌విని ఆశిస్తున్న వారే. పార్టీకి వీరేం చేశార‌నే దాని కంటే.. పార్టీ వీరికేం చేసింద‌న్న దానిపై వారు నిత్యం ఆలోచిస్తుంటార‌ని చెబుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన వెంట‌నే.. చాలామంది కాంగ్రెస్ నేత‌లు త‌మ‌కు అత్యుత్త‌మ ప‌ద‌వులు వ‌చ్చేసిన‌ట్లుగా ఫీలైనోళ్లు చాలామంది ఉన్నారు.

డామిట్ క‌థ అడ్డం తిరిగింద‌న్న చందంగా కేసీఆర్ దెబ్బ‌కు అలాంటి వారి క‌ల‌లు క‌ల్ల‌లు కావ‌ట‌మే కాదు.. స‌మీప భ‌విష్య‌త్తులోనూ త‌మ క‌ల తీరుతుందా? అన్న సందేహంతో కిందా మీదా ప‌డుతున్న ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రేవంత్ నోటి నుంచి త‌నకున్న సీఎం క‌ల‌ను బ‌య‌ట‌పెట్టేశారు.

వాస్త‌వానికి చాలామంది నేత‌లు త‌మ మ‌న‌సులోని కోరిక‌ల్ని చెప్పుకోవ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. అధిష్ఠానం గుర్తించి ప‌ద‌వులు ఇవ్వ‌టం పాత‌మాట‌. ఇప్పుడు ఎవ‌రికి వారు తాము ఎంత తోపుల‌మో చెప్పుకునేలా చేయ‌టం.. తామేం కోరుకుంటున్నామ‌న్న విష‌యాన్ని పొందిగ్గా చెప్పుకోవ‌టం ఎక్కువైంది. ఇలాంటి వారికే ఆయా పార్టీలు పెద్ద‌పీట వేస్తున్నాయి కూడా.

ఈ ట్రెండ్‌ను చూసి.. టెంప్ట్ అయి ఫాలో అయిన‌ట్లున్నారు రేవంత్‌. కానీ.. మిగిలిన పార్టీల మాదిరి కాంగ్రెస్‌లో ప‌రిస్థితులు ఉండ‌వ‌ని.. తొంద‌ర‌ప‌డితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న విష‌యాన్ని ఆయ‌న మిస్ అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. తాను సీఎం ప‌ద‌విని చేప‌ట్టాల‌ని ఉంద‌న్న మాట‌తో పాటు.. తెలంగాణ కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి ఉత్త‌మ్‌కు స‌రైన స‌ల‌హాలు ఇచ్చే వారు ఎవ‌రూ లేర‌ని చెప్ప‌టం ద్వారా.. ఇప్ప‌టికే తోపులం అనుకుంటున్న నేత‌లు చేసేదేమీ లేద‌ని తేల్చి చెప్పార‌ని చెప్పాలి.

ఈ తీరు కాంగ్రెస్ నేత‌లు ప‌లువురికి కాలిపోయేలా చేసింది. స‌రిగ్గా ఆర్నెల్లు కాలేదు పార్టీలోకి వ‌చ్చి. అప్పుడు సీఎం ప‌ద‌వి గురించి చెప్పేస్తాడా? ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వెయిట్ చేస్తున్నాం మా సంగ‌తి ఏమిటి? అంటూ ప్ర‌శ్నించే వారు లేక‌పోలేదు.

సీఎం కావాల‌న్న‌దే రేవంత్ ఆలోచ‌న అయితే కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా టీడీపీలోనే ఉండి ప్ర‌య‌త్నిస్తే స‌రిపోయేది క‌దా? అంటూ వ్యంగ్య వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో మ‌రికొంద‌రి మాట‌లు కాస్తంత సెన్స్ బుల్ గా ఉన్నాయి. ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చోవాల‌న్న‌దే రేవంత్ ల‌క్ష్య‌మైతే.. అందుకు త‌గ్గ నాయ‌కుడిగా తాను ముందు మారాలి.త‌న‌కు అనుకూలంగా ఉండే వ‌ర్గాన్ని త‌యారు చేసుకోవాలి. త‌న మాట‌ల‌కు.. చేత‌ల్ని స‌మ‌ర్థించే వ‌ర్గం బ‌లంగా ఉంటే.. సీఎం కుర్చీ దానంత‌ట అదే వ‌స్తుంద‌ని చెప్పేవారున్నారు. అస‌లు.. ముందు పార్టీ అధికారంలోకి వ‌చ్చేలా ప్ర‌య‌త్నాలు చేసి.. వాటిని పార్టీ అధినాయ‌క‌త్వం గుర్తించేలా చేయాలే త‌ప్పించి.. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌టం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని చెబుతున్నారు.

పార్టీలో ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఉన్న పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి లాంటి వారైతే.. రేవంత్ వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా స్పందిస్తున్నారు. రేవంత్ తనకు తాను నాయకుడిని అని చెప్పుకుంటే సరిపోదు, ప్రజలు గుర్తించాలని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మ‌రికొంద‌రైతే.. ఒక అడుగు ముందుకు వేసి.. రేవంత్ పార్టీలోకి వ‌చ్చిన త‌ర్వాత నుంచి ఓటుకు నోటు కేసు భారాన్ని తాము మోయాల్సి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. ఈ కేసు విష‌యంలో రేవంత్ త‌ర‌ఫున తాము మాట్లాడాల్సి వ‌స్తోంద‌ని.. ఇది త‌మ‌కు ఇబ్బందిక‌రంగా మారిందంటున్నారు. ఇలాంటివెన్నో ఉంచుకొని రేవంత్ తన‌కు తాను సీఎం కావాల‌ని చెప్ప‌టం స‌రైన‌దా? అన్న ప్ర‌శ్న‌ను ప‌లువురు సంధిస్తున్నారు. క‌ల‌లు క‌న‌టం త‌ప్పు కాదు. కానీ.. ఆ క‌ల‌కు త‌గ్గ‌ట్లు కృషి చేయ‌టంతో పాటు.. ఆ క‌ల‌ను రివీల్ చేసే టైంను స‌రిగా ఎంచుకోవ‌టం అవ‌స‌ర‌మ‌న్న‌ది రేవంత్ గుర్తిస్తే మంచిది. లేకుంటే.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా అసంతృప్తి కొండ‌లా పెరుగుతుంద‌ని మ‌ర్చిపోకూడ‌దు.