Begin typing your search above and press return to search.

కాపీక్యాట్‌ పోరాటం : ఫైర్‌ చచ్చిపోయిందా?

By:  Tupaki Desk   |   17 Sep 2016 4:28 AM GMT
కాపీక్యాట్‌ పోరాటం : ఫైర్‌ చచ్చిపోయిందా?
X
తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి అంటే ఫైర్‌ బ్రాండ్‌! కేసీఆర్‌ సర్కారు మీద విరుచుకుపడడంలో.. నిశిత విమర్శలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో.. కేసీఆర్‌ ప్రభుత్వపు గుత్తాధిపత్యానికి జంకకుండా దూసుకుపోవడంలో.. తెదేపాకు చెందిన రేవంత్‌ రెడ్డి తరవాతే ఎవరైనా.. అని అందరూ అనుకునే వారు. అయితే ఇదంతా గతం అని.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని - రేవంత్‌ లో కూడా ఫైర్‌ చచ్చిపోయినట్లుగా కనిపిస్తోందని - ఆయన ప్లాన్‌ చేస్తున్న పోరాటాలు - చేపడుతున్న ఉద్యమాలు అన్నీ కాపీ క్యాట్‌ లాగా ఉంటున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.

రేవంత్‌ రెడ్డి పాపం బలం లేని తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకుడిగా తెరాసతో పోరాడడానికి అలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు స్వంత పార్టీ నుంచి ఎంత మద్దతు లభిస్తున్నదో తెలియదు గానీ.. మొత్తానికి తన పాట్లు తాను పడుతున్నారు. కాకపోతే ప్రభుత్వంపై ఏమాత్రం ప్రభావం చూపలేని విధంగా, ప్రజలను కొత్తగా ఆలోచింపజేయలేని విధంగా కాపీ పోరాటాలే చేపడుతున్నారంటూ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

మల్లన్నసాగర్‌ విషయానికే వస్తే.. రైతులు అన్యాయానికి గరవుతున్నారని, మహారాష్ట్రతో ఒప్పందం లోపభూయిష్టం అని దాన్ని రద్దు చేసుకోవాలని కాంగ్రెస్‌ ఇదివరకే పలు దీక్షలు చేసింది. కాంగ్రెస్‌ నాయకులు రెండు రోజుల నిరాహార దీక్షలు కూడా చేశారు. ఇప్పుడు మళ్లీ రేవంత్‌ అదే సేమ్‌ టూ సేమ్‌ పాట పాడుతున్నారు. ఇందిరా పార్కు వద్ద రెండురోజుల దీక్ష చేస్తా అంటున్నారు. అసలే ఆయన వెంట నిలబడగల సొంత పార్టీ నాయకులు ఎందరరో లెక్క తేలడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోలేని పసలేని కాపీ పోరాటాలనే ప్లాన్‌ చేసుకుంటే.. రేవంత్‌ ఎలా మనగలుగుతారు అని జనం ప్రశ్నిస్తున్నారు.