Begin typing your search above and press return to search.

మార్చి ఇష్యూకు ఆగ‌స్టులో లొల్లేంది రేవంత్‌!

By:  Tupaki Desk   |   9 Aug 2016 7:48 AM GMT
మార్చి ఇష్యూకు ఆగ‌స్టులో లొల్లేంది రేవంత్‌!
X
తెలంగాణ అధికార‌ప‌క్షం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు సైకిల్ దిగేసి గులాబీ కారు ఎక్కిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత రేవంత్ రెడ్డి తాజాగా న్యాయ‌పోరాటానికి దిగారు. జంపింగ్స్ పై నేరుగా ఫిర్యాదు చేయని ఆయ‌న‌.. టీడీపీ శాస‌న‌స‌భ పార్టీని టీఆర్ ఎస్ శాస‌న‌స‌భ పార్టీలోకి ఎలా విలీనం చేస్తారంటూ న్యాయ‌పోరాటానికి దిగారు.

తెలంగాణ శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి మార్చి 10న జారీ చేసిన బులిటెన్ లో పేర్కొన్న అంశాల్ని ఆయ‌న స‌వాల్ చేశారు. త‌మ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేర‌టం ఒక ఎత్తు అయితే.. త‌మ శాస‌న‌స‌భాప‌క్ష పార్టీ తెలంగాణ అధికార‌ప‌క్షంలో విలీనం అయిన‌ట్లుగా అసెంబ్లీ స్పీక‌ర్ ఎలా గుర్తిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. ఇందులో భాగంగా హైకోర్టులో రేవంత్ దాఖ‌లు చేసిన పిటీష‌న్ పై విచార‌ణ‌కు స్వీక‌రించిన న్యాయ‌స్థానం.. ప్ర‌తివాదులుగా పేర్కొన్న 12 మంది ఎమ్మెల్యేల‌కు నోటీసులు జారీ చేసింది. కోర్టు నోటీసులు జారీ చేసిన వారిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యంసాధించి.. టీఆర్ ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలంతా ఉన్నారు.

మ‌రోవైపు.. రాజ్యాంగంలోని ప‌దో షెడ్యూల్ ప్ర‌కారం అసెంబ్లీలో రాజ‌కీయ పార్టీ విలీనాన్ని ఎన్నిక‌ల సంఘానికి సంబంధించిన అంశ‌మ‌ని.. దీనికి అసెంబ్లీ స్పీక‌ర్ కు సంబంధం లేదంటూ రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు. పార్టీ విలీనం అనేది ఎన్నిక‌ల సంఘం ప‌రిధిలోని అంశ‌మ‌ని.. అసెంబ్లీకి సంబంధం లేద‌ని.. ఆ విష‌యాన్ని గ‌తంలో సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కూడా స్ప‌ష్టం చేసిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఉమ్మ‌డి హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎం.ఎస్‌. రామ‌చంద్ర‌రావు నోటీసులు జారీ చేసి త‌దుప‌రి విచార‌ణ‌ను 2 వారాల‌కు వాయిదా వేశారు. మార్చిలో బులిటెన్ విడుద‌లైతే ఆగ‌స్టులో న్యాయ‌పోరాట‌మేంది రేవంత్‌?