Begin typing your search above and press return to search.

అమ‌రుల కోసం రేవంత్ కొత్త ఎజెండా

By:  Tupaki Desk   |   3 Dec 2016 4:05 PM GMT
అమ‌రుల కోసం రేవంత్ కొత్త ఎజెండా
X
తెలంగాణ మలి ఉద్యమానికి ఊపునిచ్చిన తొలి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి మరణించిన డిసెంబర్ 3వ తేదీని అమరవీరుల సంస్కరణ దినంగా ప్రకటించాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా హైద‌రాబాద్‌లోని ఎల్బీనగర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహానికి రేవంత్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అమరవీరులను గౌరవించే కనీస సంస్మృతి కూడా టీఆర్ ఎస్‌ కు లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ తొలి ఉద్యమంలో మరణించిన 369 మంది అమరవీరులు - మలి ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న 1200 మంది అమరవీరుల కుటుంబాలను గుర్తించి ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని, అలాగే ప్రతి కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమిని, కుటుంబానికో ఉద్యోగాన్ని డబుల్ బెడ్రూం ఇంటిని కూడా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఇదే విషయంగా తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టినప్పుడు అందరూ ఏకగ్రీవంగా దానిని అమోదించడం కూడా జరిగిందని చెప్పారు. అయితే, ఇది జరిగి ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు దాటిపోయినా ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కూడా ఇప్పటి దాకా పూర్తిగా గుర్తించలేక పోయిందని రేవంత్ విమర్శించారు.

1569 మంది అమరవీరుల కుటుంబాలలో ఇప్పటి దాకా కేవలం 500 కుటుంబాలకు మాత్రమే సహాయాన్ని అందించిందని రేవంత్ ప్ర‌క‌టించారు. మిగిలిన వెయ్యికి పైగా అమర వీరుల కుటుంబాలను ఇప్పటి వరకు కనీసం గుర్తించడం కూడా జరగలేదని వాపోయారు. కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా ఏ ఒక్క అమర వీరుల కుటుంబానికి కూడా మూడెకరాల భూమిని, డబుల్ బెడ్రూం ఇంటిని ఇవ్వలేదని తెలిపారు. అలాగే టీఆర్ ఎస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ అమర వీరులను శాశ్వ‌తంగా గుర్తించుకునేలా అంతర్జాతీయ స్థాయిలో ఒక స్మారక సూపాన్ని నిర్మించడంతో పాటు అక్కడ నిరంతరం వెలిగే జ్వాలను ఏర్పాటు చేస్తామని, అదే ప్రాంతంలో అమర వీరుల జీవిత విశేషాలతో కూడిన మ్యూజియంను ఏర్పాటు చేస్తామని ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిందని రేవంత్ వెల్లడించారు. అయితే, రాష్ట్రం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు అమరవీరుల స్మారక సూపాన్ని నిర్మించడానికి కనీసం స్థలాన్ని కూడా గుర్తించడం జరగలేదని ఇది కేసీఆర్‌కు అమరవీరుల పట్ల ఉన్నగౌరవానికి నిదర్శనమని రేవంత్ దుయ్య‌బ‌ట్టారు. అమరవీరులను గౌరవించే కనీస సంస్కతి కూడా టీఆర్ఎస్ పార్టీకి, నేతలకు లేదని ధ్వజమెత్తారు.

జనవరి 30న భారతదేశ స్వాతంత్ర్య సమర యోదుల స్మారక దినాన్ని నిర్వహిస్తారని, అక్టోబర్ 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినాన్ని పాటిస్తారని అదే రీతిలో శ్రీకాంతాచారి మరణించిన డిసెంబర్ 3ను తెలంగాణ అమరవీరుల స్మారక దినంగా ప్రకటించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి గడిచిన రెండేళ్లుగా ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నా ప్రభుత్వం మాత్రం అమర వీరుల సంస్మరణ దినాన్ని ప్రకటించడానికి సుముఖంగా రేవంత్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ తెలంగాణ అమరవీరులను మరిచిపోయిందని రాష్ట్రంలో పేదల కష్టాలను పట్టించుకోవడం మానేసిందని ఆయన ధ్వజమెత్తారు. డిసెంబర్ 3ను తెలంగాణ అమర వీరుల సంస్మరణ దినోత్సవంగా ప్రకటించకపోతే ఈ విషయంగా కూడా పోరాటాలకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/