Begin typing your search above and press return to search.

ఈ ప‌చ్చ ర‌క్తం లెక్కేంది రేవంత్

By:  Tupaki Desk   |   31 Oct 2017 3:44 AM GMT
ఈ ప‌చ్చ ర‌క్తం లెక్కేంది రేవంత్
X
ఉన్న పార్టీలో నుంచి వేరే పార్టీలోకి మార‌టం రాజ‌కీయ నేత‌ల‌కు కొత్తేం కాదు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రేవంత్‌కు అస్స‌లు కొత్త‌కాదు. ఇప్ప‌టికే ఆయ‌న రెండుసార్లు పార్టీ మారారు. తాజాగా కాంగ్రెస్‌ లోకి ఆయ‌న ప్ర‌యాణం ముచ్చ‌ట‌గా మూడోసారి. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా ఆలోచించి పార్టీ మార‌టం రేవంత్‌ కు అల‌వాటే. తాజాగా ఆయ‌న టీడీపీ నుంచి కాంగ్రెస్‌ కు వెళుతున్నారు.

సాధార‌ణంగా ఇలాంటి సంద‌ర్భాల్లో తాను వీడి వ‌చ్చిన పార్టీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌టం.. అధినేత‌ను తిట్టిపోయ‌టం లాంటివి క‌నిపిస్తాయి. కానీ.. రేవంత్ అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాను పార్టీ మార‌టం వెనుక ఉన్న అవ‌స‌రాన్ని చెబుతున్న ఆయ‌న‌.. బాబును ప‌ల్లెత్తు మాట అన‌టం లేదు. ఆ మాట‌కు వ‌స్తే.. చంద్ర‌బాబును పొగిడేస్తూ ఆకాశానికి ఎత్తేయ‌టం క‌నిపిస్తుంది.

త‌న లక్ష్యం కేసీఆర్ అని.. తెలంగాణ‌లో రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ జ‌ర‌గాల్సిన అవ‌స‌రాన్ని ప‌దే ప‌దే నొక్కి వ‌క్కాణిస్తున్న రేవంత్ తాజాగా మ‌రోసారి అదే వాద‌న‌ను వినిపించారు. ఇందులో భాగంగా తాను ఏ పార్టీనైతే ఇంత‌కాలం ప్రాతినిధ్యం వ‌హించారో.. ఆ పార్టీ గురించి ఒక్క విమ‌ర్శ కూడా చేయ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ స‌భ్యులు న‌లుగురు ఒక‌వైపు.. నాలుగుకోట్ల మంది ప్ర‌జ‌లు ఇంకోవైపు నిలుచున్నార‌ని చెప్పిన రేవంత్ తాను ఏ ప‌రిస్థితుల్లో పార్టీని మారాల్సి వ‌చ్చింద‌న్న మాట‌ను ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. వివ‌రంగా చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న ఒంట్లో ఉన్న‌ది పసుపుప‌చ్చ ర‌క్త‌మేన‌ని చెప్పిన రేవంత్‌.. తాను ప‌సుపుప‌చ్చ జెండాకు వ్య‌తిరేకం కానే కాద‌న్నారు. త‌న‌లో ఉన్న‌ది పసుపుప‌చ్చ ర‌క్త‌మ‌ని.. ఎన్టీఆర్ అందించిన పౌరుషం.. ఆద‌ర్శం తీసుకొని కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తాన‌న్నారు..

టీడీపీ.. బీజేపీ పొత్తు పెట్టుకుంటే అంతిమంగా టీఆర్ఎస్‌కు మేలు జ‌రుగుతుంద‌ని చెప్పిన రేవంత్‌.. బీజేపీ నేత‌ల‌పై ఆస‌క్తిక‌ర విమ‌ర్శ‌లు చేశారు. కేసీఆర్‌ను మ‌రోసారి సీఎం చేయ‌టానికి బీజేపీ నేత‌లు విద్యాసాగ‌ర్ రావు.. ముర‌ళీధ‌ర్ రావులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా ఆరోపించారు. బీజేపీ.. మోడీ.. కేసీఆర్ లు పొద్దున తిట్టుకుంటూ సాయంత్రం వేళ స‌మ‌ర్ధించుకుంటున్నార‌న్నారు.

టీడీపీ జెండాల‌ను.. గ‌ద్దెల‌ను కూల్చేస్తూ.. పార్టీ నేత‌ల్ని..కార్య‌క‌ర్త‌ల్ని జైళ్ల‌ల్లో పెట్టిస్తుంటే.. బ‌ట్ట‌లూడ‌దీసి బేడీలు వేసి బ‌జారున న‌డిపిస్తుంటే.. అలాంటి పార్టీతో ఎలా న‌డుస్తామ‌ని రేవంత్ వ్యాఖ్యానిస్తున్నారు. ఓప‌క్క కాంగ్రెస్ పార్టీలో చేరుతూ త‌న‌లో ప‌సుపుప‌చ్చ ర‌క్తం ఉంద‌ని ప్ర‌క‌టించిన ఏకైక మొన‌గాడు రేవంత్ అని చెప్పాలి.

బ‌ర్రెలు.. గొర్రెలు.. చేప‌లు.. బ‌తుక‌మ్మ చీరెల కోస‌మే రాష్ట్రంలో 1200 మంది ఆత్మ బ‌లిదానం చేసుకున్న‌దంటూ ప్ర‌శ్నించిన రేవంత్‌.. తాను సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు ద‌గ్గ‌ర శిక్ష‌ణ పొందిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఏపీ అభివృద్ధి కోసం అనుక్ష‌ణం ఆరాట‌ప‌డుతూ.. క‌ష్టించి ప‌ని చేసే చంద్ర‌బాబు త‌న‌కు ఆద‌ర్శ‌మ‌న్న రేవంత్‌.. తెలంగాణ బాబు కోస‌మే తాను పార్టీ మారిన‌ట్లు చెప్పారు.

పార్టీ మారిన‌ప్పుడు రోటీన్ గా ఉండే కంప్లైంట్స్‌కు భిన్నంగా రేవంత్ మాట‌లు ఉండ‌టం వెనుక పెద్ద లెక్కే ఉంద‌ని చెబుతున్నారు. పార్టీ పున‌రంకితం కావాల‌ని.. తెలంగాణ రాష్ట్ర అధికార‌పక్షాన్ని దెబ్బ తీయాలంటూ కాంగ్రెస్ మిన‌హా మ‌రే పార్టీ తెలంగాణలో లేద‌న్న విష‌యాన్ని చెప్ప‌టం క‌నిపిస్తుంది. మ‌రో దారి లేక మాత్ర‌మే కాంగ్రెస్ లో చేరుతున్న‌ట్లు చెప్పిన వైనం టీడీపీ నేత‌లతో పాటు టీఆర్ ఎస్ నేత‌ల్లో ప‌లువురిని ఆక‌ట్టుకునేలా ఉంది. నిజానికి ఈ ప్లాన్ తోనే రేవంత్ మాట‌లు ఉన్నాయ‌ని చెప్పాలి. కేసీఆర్ ను రాజ‌కీయంగా దెబ్బ తీయ‌టానికి మాత్ర‌మే తాను పార్టీ మారానే త‌ప్పించి ప‌ద‌వులు కోసం కాద‌న్న సందేశాన్ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా రేవంత్ మాట‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. మొత్తంగా రేవంత్ మాట‌లు చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ను ఫాలో అయ్యే వారు ఒక ప‌క్షాన‌.. కేసీఆర్ ను వ్య‌తిరేకించేవారు మ‌రో ప‌క్షాన నిలవాల‌న్న త‌ప‌న క‌నిపిస్తుంది.