Begin typing your search above and press return to search.

కేసీఆర్ అప్పు: రేవంత్ లాజిక్

By:  Tupaki Desk   |   19 March 2016 4:32 AM GMT
కేసీఆర్ అప్పు: రేవంత్ లాజిక్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఎలా ఉంది? ఈ ప్రశ్నను ఓ సగటు తెలుగువాడిని అడిగినా.. చెప్పే మాట.. ‘‘ఇరగదీసేస్తున్నాడు’’ అని చప్పున చెప్పేస్తారు. అదెలా అంటే.. భారీ లిస్ట్ చదువుకుంటూ పోతుంటారు. చేతిలో కాసులుంటే ఎవరైనా ఏమైనా చేయగలరు అని విమర్శ చేస్తే... మరింత మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఎవరూ ఏమీ చేయలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం రావటమే ఆలస్యం కేసీఆర్ చూశారా? ఎలా పని చేస్తున్నారో అని చెప్పటమే కాదు.. ఆయన అమలు చేస్తున్న పథకాల్ని కంఠతా చెప్పటమే కాదు.. విమర్శల్ని చేసే వారిని పిచ్చిగా చూసేందుకు వెనుకాడరు.

సామాన్యల సంగతి ఇలా ఉంటే.. మరి రాజకీయ నాయకుల సంగతి ఎలా ఉంది? కేసీఆర్ ను విపరీతంగా వ్యతిరేకించే తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఏం చెబుతున్నాడన్న సంగతి చూస్తే.. కాస్తంత ఆశ్చర్యపోవాలి. అరే.. మనం ఈ కోణంలో అస్సలు ఆలోచించలేదే? అని అనుకోకుండా ఉండలేం. కేసీఆర్ ను పొగిడేసే పనిలో పడి చాలా విషయాల్ని మిస్ అవుతున్నామని.. వాస్తవాల్ని అస్సలు పట్టించుకోవటం లేదన్న విషయం అర్థమవుతుంది. నిజంగానా? అన్న సందేహం కంటే కూడా.. రేవంత్ రెడ్డి మాటల్ని లాజిక్ గా ఆలోచించి చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

ఇంతకీ రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటారా? ఆయన మాటల్ని ఆయన చెప్పినట్లే చదివితే..

‘‘అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం రూ.1.50లక్షల కోట్ల అప్పు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో పని చేసిన 16 మంది ముఖ్యమంత్రులు కలిసి రూ.60వేల కోట్లు అప్పు చేస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా రూ.1.50కోట్ల అప్పులు చేశారు’’ అని సూటిగా ప్రశ్నించారు.

దీనికి.. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చెప్పిన జవాబు ఏమిటో తెలుసా..? ‘‘విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణానికే రూ.91,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వివిధ ఆర్థిక సంస్థల ద్వారా నిధులు సమీకరిస్తున్నాం. మరి వాటికి డబ్బులు కట్టొద్దా? రైతులకు 9 గంటల కరెంటు ఇవ్వొద్దా?’ అని ప్రశ్నించారు.

అంటే.. 21 నెలల స్వల్ప వ్యవధిలో కనిపిస్తున్న అభివృద్ధి.. రెప్పపాటు కరెంటు పోని వెనుక.. మరికొన్ని సంక్షేమ కార్యక్రమాల వెనుక రూ.1.50లక్షల కోట్లు ఉందన్న విషయం మర్చిపోకూడదు. భవిష్యత్తు సంగతి వదిలేసి.. ప్రస్తుతానికి అప్పులతో హడావుడి చేస్తుంటే.. ఆనందించాలా? దీన్ని అప్పు చేసి పప్పు కూడా అనకూడదా..?