Begin typing your search above and press return to search.

ఆలూచూలూ లేదు, పోరుకు తొడకొట్టేశారు!

By:  Tupaki Desk   |   16 Sep 2017 4:32 AM GMT
ఆలూచూలూ లేదు, పోరుకు తొడకొట్టేశారు!
X
నల్గొండ ఎంపీస్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నదనేది ఇప్పటిదాకా కేవలం ఒక పుకారు మాత్రమే. కానీ ఈ విషయంలో ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న సామెత చందంగా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. నల్గొండ ఉప ఎన్నికే గనుక వస్తే.. తెరాస ఓటమి ఖరారు అనీ... ఇక్కడ బరిలోకి దిగి తమ సత్తా నిరూపించుకుంటాం అని ఎవరికి వారు అప్పుడే ప్రగల్భాలకు దిగుతున్నారు. తాజాగా వ్యక్తిగతంగా తాను ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ లో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ... నల్లగొండ ఎంపీగా ఉప ఎన్నిక వస్తే పార్టీ తరఫున బరిలోకి దిగడానికి సిద్ధమే అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం కూడా హాస్యాస్పదంగానే ఉంది.

2014 ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఏ కీలక ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా తమ సత్తా నిరూపించుకోలేదు. ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా వారికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయే తప్ప.. ఆ పార్టీకి ప్రజాదరణ తగ్గిపోలేదని ఎక్కడా తేలలేదు. పైగా ఓడిపోయిన ప్రాంతాల్లో కూడా సాధించిన ఓట్ల శాతం చాలా ప్రమాదకరమైన సంకేతాలు ఇచ్చేలా ఉంది. ఒకవైపు ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో అసెంబ్లీలో కూడా బలం కోల్పోయిన తెలుగుదేశం.. ఎన్నికల ప్రాతిపదికగా అయితే ప్రజల దృష్టిలో కూడా చాలా వరకు బలం కోల్పోయినట్లే లెక్క. అయినా సరే.. ప్రతి ఎన్నికల్లోనూ పోటీకి దిగడం భంగపడడం జరుగుతోంది. తాజాగా అసలంటూ ఊసే లేని ఎన్నికకు కూడా రేవంత్ రెడ్డి తొడకొట్టేస్తున్నారు. మరోసారి భంగపాటు ఎదుర్కొనడానికి తాను సిద్ధమే అన్నట్లుగా రేవంత్ రెడ్డి వైఖరి కనిపిస్తోంది.

గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేయడం అనేది అంత సులువుగా సాధ్యమయ్యే సంగతి కాదు. ఆయనకు ఎటొచ్చీ రాష్ట్ర కేబినెట్ హోదా గల పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల వ్యవధి కూడా లేని ఎంపీ పదవికి రాజీనామా చేసి.. కోట్ల రూపాయల వృథా ఖర్చుకు ఎవరైనా సరే ఎందుకు సిద్ధపడతారు? అందుకే ఇక్కడ ఉప ఎన్నిక అన్నది ఊహాగానం మాత్రమే అని పలువురు భావిస్తున్నారు. ఇది ప్రాక్టికల్ గా జరిగే ఎన్నిక కాదు గనుకనే... రేవంత్ రెడ్డి లాంటి వారు.. పోటీకి తాను రెడీ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని కూడా జనం నవ్వుకుంటున్నారు.